37వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 17,2024 21:39

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు చేరుకుంది.కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 37 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం వేతనాలు చెల్లించ లేమని చెప్పడం సరికాదన్నారు. జీతాలు పెంచేవరకు ఉద్యమం కొనసాగు తుందన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం మానుకొని సమస్యలు పరిష్కారం కోసం దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. గంగిరెద్దుకు వినతి గజపతినగరం : సమ్మెలో భాగంగా అంగన్వాడీలంతా గంగిరెద్దుకు సమస్యలతో కూడిన వినతిని సమర్పించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జీతాలు పెంచకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని, మినీ కేంద్రాలను, మెయిన్‌ కేంద్రాలుగా మార్చడం లేదని, ఎక్స్‌గ్రేషియో, పెన్షన్‌ , గ్రాట్యుటీ వంటి సమస్యలను పరిష్కరించమంటే మొండిగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం పునరాలోచించి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కంచాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి, ప్రాజెక్టు నాయకులు అనురాధ, అప్పలకొండ, లక్ష్మి, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట : ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ల ముఖ్య నాయకులతో చర్చలు సానుకూలంగా జరపకుండా ఆర్థికపరమైన విషయాన్ని ఎక్కడా చర్చించకుండా జులై తరువాత వేతనాలకు సంబంధించి చూద్దామని డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారని అన్నారు. జులై తరువాత ఈ ప్రభుత్వం వస్తుందని గ్యారెంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా వ్యవహరించలేదని అన్నారు.ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టుల దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. యూనియన్‌ నాయకులు డి.శ్యామల, డి.జయలక్ష్మి, వి.మాణిక్యం, కె.సుశీల, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️