9గంటల కరెంటు ఇవ్వండి సారూ..

Feb 27,2024 21:43
ఫొటో : ఎఇతో మాట్లాడుతున్న రైతులు

ఫొటో : ఎఇతో మాట్లాడుతున్న రైతులు
9గంటల కరెంటు ఇవ్వండి సారూ..
– విద్యుత్‌ ఎఇ శ్రీనివాసులురెడ్డిని అడ్డుకున్న రైతులు
ప్రజాశక్తి కావలి రూరల్‌ : తమ పంటలు చివరి దశకు చేరుకున్నా యని కేవలం కరెంటు లేక సాగునీరందక ఎండిపోతున్నాయని తమకు 9గంటల వ్యవసాయ విద్యుత్‌ను అందించాలని రైతులు కోరారు. కావలి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుండి వ్యవసాయానికి కరెంటు నిలిచిపోవడంతో వ్యవసాయానికి నీటి సరఫరా లేనందున ఎండిపోతున్న పంటలు, కరెంటు సమస్యను పరిశీలించడానికి వచ్చిన రూరల్‌ విద్యుత్‌ ఎఇ శ్రీనివాసుల రెడ్డిని రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో బోర్లు కింద ఆధారపడి సుమారు 300ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సంక్రాంతి దగ్గర నుంచి దాదాపు 30 రోజులపాటు తమ ఊరికి సరిగ్గా నాణ్యమైన 9గంటల కరెంటు సరఫరా కాకపోవడంతో దాదాపు 50, 60 మోటర్లు కాలిపోయాయని, కరెంటు సరిగా లేకపోవడంతో ఇచ్చే 7గంటల కరెంటు కూడా రెండు గంటలు ఆపడం జరుగుతుందన్నారు. దానివల్ల పంటలకు సరిగా నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గతంలో సోమరుపాడు లైన్‌ నుండి కరెంటు ఇచ్చే వాళ్లని లోడు ఎక్కువగా ఉన్నందున కరెంటు సమస్యలు ఉన్నాయని ఎఇని కోరగా, స్పందించిన ఆయన కొత్తపల్లి నుండి కావలికి రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టిస్తే కావలి నుండి కరెంటు ఇచ్చే మార్గం చేస్తామని చెప్పారన్నారు. దానికి తగినట్లు ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ బోరికి తలా రూ.100 వేసుకొని రూ.30వేలు ఖర్చుపెట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించినట్లు తెలిపారు. తర్వాత నాలుగు రోజులు బాగానే కరెంటు వచ్చిందని అయితే మళ్లీ గత మూడు రోజుల నుండి కరెంటు రావడం లేదని ఇప్పుడు పంటలు చివరి దశకు వచ్చాయని రెండు, మూడు తడులు ఇస్తే పంటలు చేతికొస్తాయన్నారు. ఇప్పుడు రెండు, మూడు తడులు గానీ వెయ్యలేకపోతే చేతికి వచ్చిన పంట నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండనక వాననక ఆరుగాలం చమటోర్చి కష్టపడి పండించుకున్న పంట తమకు దక్కకపోతే తాము ఆత్మహత్య చేసుకోవడం తప్పదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పంట పొలాలకు వీలైనంత తొందరగా నాణ్యమైన 9గంటల కరెంటు ఇస్తే తమ పంటలు చేతికి దక్కుతాయని కోరారు. కార్యక్రమంలో రైతులు పాటిబండ్ల కృష్ణయ్య, చిమ్మిలి హజరత్‌, చిమ్మిలి మోహనరావు, చిమ్మిలి మార్కండేయులు, చిమ్మిలి మహేశ్వరరావు, చిమ్మిలి సురేష్‌, తోమాటి వెంకటేశ్వర్లు, తదితర రైతుల పాల్గొన్నారు.

➡️