ఓట్ల లెక్కింపు కోసం 973 మంది

May 24,2024 00:01

ర్యాండమైజేషన్‌ ద్వారా ఉత్తర్వులు జనరేట్‌ చేస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నియమించిన కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కోసం గురువారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరితో కలసి ఎన్‌ఐసి పోర్టల్‌ ద్వారా మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించి ఉత్తర్వులను జనరేట్‌ చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఈవియం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన 245 టేబుల్స్‌కు అవసరమైన కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు రిజర్వుతో కలిపి మొత్తం 973 మంది ఉద్యోగులకు శిక్షణ ఉత్తర్వులను జనరేట్‌ చేశారు. ఈవీయం ఓట్లు లెక్కించే కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు మే 27వ తేదీ రెండు షిఫ్ట్‌లలోనూ, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేసే కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు మే 28వ తేది ఉదయం ఒక షిఫ్ట్‌లో కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాల్‌లో కౌంటింగ్‌పై మొదటి విడత శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, తాడికొండ నియోజకవర్గ ఆర్‌ఓ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గంగరాజు, పొన్నూరు నియోజకవర్గ ఆర్‌ఓ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీకుమారి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిఎంసి అదనపు కమిషనర్‌ కె.రాజ్యలక్ష్మీ , ఎన్నికల మ్యాన్‌ పవర్‌ నోడల్‌ అధికారి శైలజ, ఐటీ నోడల్‌ అధికారి రఘ, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఏఈఆర్వో బీమారావు, ఎన్‌ఐసీ డిఐఓ బిమల్‌ కుమార్‌, మురళికృష్ణ పాల్గొన్నారు.
కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపునకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు తెలిపారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ వీసీ సమావేశ మందిరం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర కమిషనర్‌ కీర్తీ చేకూరితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏఎన్‌యులోని నాలుగు బ్లాక్‌లలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపునకు కౌంటింగ్‌ హాల్స్‌లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందన్నారు. కౌంటింగ్‌ హాల్స్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం లీజ్డ్‌లైన్లు ఏర్పాట్లు రెండ్రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్‌హాల్స్‌, స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. మీడియా సెంటరులో ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపునకు సంబంధించి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల్లోపు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌ల ఓట్ల లెక్కింపు సాయంత్రం ఆరుగంటలకు పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు ఉన్నందున రాత్రి 8 గంటలకు కౌంటింగ్‌ పూర్తయ్యే అవకాశం ఉందని, మిగతా నియోజకవర్గాలు సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్‌ పూర్తవుతుందని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపునకు సంబంధించి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఓట్లు లెక్కింపునకు సంబంధించి మొదటి ర్యాండమైజేషన్‌ ద్వారా ఉద్యోగులను శిక్షణకు కేటాయించామని, వీరికి 27, 28 తేదీల్లో మొదటి శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్‌ 2వ తేది రెండవ ర్యాండమైజేషన్‌ చేసి కౌంటింగ్‌ సిబ్బందికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెండవ విడత శిక్షణ ఇస్తామని ముఖేష్‌కుమార్‌ మీనాకు కలెక్టర్‌ వివరించారు.

➡️