ఉద్యోగులకు వల!

May 4,2024 23:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పోస్టల్‌ ఓట్లను వినియోగించుకుంటున్న ఉద్యోగులను తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు వైసిపి, టిడిపి పావులు కదుపుతున్నాయి. పోస్టల్‌ ఓట్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తీసుకున్న ప్రధాన పార్టీల వారు వారిని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వివిధ రూపాల్లో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అధికారులు గుంటూరు,పల్నాడు జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్‌ ఓట్లను వినియోగించకునేందుకు ఏర్పాట్లు చేశారు. 5, 6, 7, 8 తేదీల్లో పోస్టల్‌ ఓట్లను వినియోగించుకనేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాలుఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల పరిశీలన జరుగుతున్నా రహస్యంగా అభ్యర్థుల తరుఫున కొన్ని బృందాలు వీరిని ఆకట్టుకునేందుకు నగదు, తాయిలాలు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగుల ఫోన్‌ పే నంబర్లను ముందే తెప్పించుకున్న అధికార పార్టీ నేతలు వారి అనుచరుల ద్వారా నేరుగా బ్యాంకుల్లో నగదు జమ చేస్తున్నామని ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గత ఐదేళ్లుగా తమ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల అసంతృప్తిగా ఉన్న కొంతమంది ఉద్యోగులు వైసిపి కార్యకర్తలు,నాయకులు పిలిచినా మొహం చాటేస్తున్నారు. కొంతమంది గత రెండురోజులుగా గుర్తు తెలియని నెంబర్లు ఫోన్లు కూడా లిఫ్టు చేయడంలేదు. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు జీవనర్మణ సమస్యగా మారడంతో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలన్న తాపత్రాయంతో తమ గెలుపునకు పోస్టల్‌ ఓట్లు కూడా కీలకమని భావించి ఉద్యోగులకు ఎర వేస్తున్నారు. సామాజికవర్గాలకు చెందిన నాయకులు, ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులంతా రంగంలోకి దిగి తమకే ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, మంగళగిరి, తాడికొండలో మన వాళ్ల అమ్మాయే ఈసారికి వీరికి చేయండి అంటూ తమకు ఫోన్లు వస్తున్నాయని కొంత మంది ఉద్యోగులు తెలిపారు. అంతర్గతంగా ఇప్పటికే కొంత మంది ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయా సామాజిక తరగతులు, వివిధ కులాలకు సంబంధించిన నాయకులను పిలిపించి మాట్లాడి ఈ సారికి మీరుమాకు చేయండి… మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు ఇలా చేస్తాం… అలాచేస్తాం.. మీ సమస్యలను తీరుస్తామని చెబుతున్నారు. వైసిపి, టిడిపి అభ్యర్థులు, వారి అనుచరలు, బంధువులు ఉద్యోగులను ఆకట్టు కునే ప్రయత్నాల్లో ఉన్నారు. వ్యక్తిగత అంశాలతో పాటు సామా జిక అంశాలపైనా నేతలు హామీలు గుప్పిస్తున్నారు. జిల్లాలో టిడిపి, వైసిపి తరుఫున 80 శాతం మంది కార్పొరేట్‌, పలు వ్యాపార సంస్థల కు చెందిన శత కోటిశ్వరులు బరిలో ఉండటంతో డబ్బు పంపిణీకి వెనుకాడటం లేదు. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఉన్నతాధికారులూ కొంతమంది ఈసారికి ఇలా కానివ్వండి అంటూ సూచనలు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నఉద్యోగ సంఘం నాయకుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి గుంటూరులో శనివారం మీడియాతో మాట్లా డుతూ వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో మేలు చేసిందన్నారు. ఈసారి ఎన్నికల్లో పోస్టల్‌ ఓటు ఉన్న ఉద్యోగులు వైసిపికి ఓటు వేయాలని బహిరంగంగా విజ్ఞప్తిచేయడం గమనార్హం.

➡️