‘బలిమెల’ నీటి వినియోగంపై సమీక్ష

బలిమెల జలాశయం

ప్రజాశక్తి -సీలేరు: ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు సోమవారం చిత్రకొండ ఒపిహెచ్‌ గెస్ట్‌ హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024 ఏప్రిల్‌ నెలలో ఆంధ్ర తన వాటాగా 4.7937 టిఎంసిలు నీటిని వినియోగించుకోగా, ఒడిశా 9.1148 టిఎంసిలు నీటిని వినియోగించుకున్నట్లు లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆంధ్ర కంటే ఒడిశా 6.0627 టిఎంసిల నీటిని అధికంగా వినియోగించుకున్నట్లు లెక్కలు తేల్చారు. 2023 నుంచి 2024 ఏప్రిల్‌ నెల చివరి నాటికి ఆంధ్ర తన వాటా మొత్తం 59.1210 టిఎంసిలు నీటిని వినియోగించుకుందని, ఒడిశా 2024 ఏప్రిల్‌ నెల చివరి నాటికి 51.4259 టిఎంపిలు నీటిని వినియోగించుకున్నట్లు ఇరు రాష్ట్రాల అధికారులు లెక్కలు తేల్చారు. ఇప్పటివరకు ఒరిస్సా కంటే ఆంధ్ర 7.6951 అధికంగా వినియోగించుకున్నట్లు ఇరు రాష్ట్ర అధికారులు నిర్ధారించారు. బలిమెల, జ్వాలాపుట్‌ జలాశయాల23.4123 టిఎంసిల నీటి నిలువలు ఉన్నాయని, వీటిలో ఆంధ్ర వాటాగా 15.5537 టిఎంసిలు నీటిని పంపకాలు జరిపారు. బలిమెల, జోలాపుట్టు నది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం సీజన్‌ ప్రారంభ అయ్యేంతవరకు ఉన్న నీటి నిలువలను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు భావించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి ఇరిగేషన్‌ నీటి అవసరాలకు బలిమెల జలాశయం నుంచి ఆంధ్రకు రెండు వేలు క్యూసెక్కులు, ఒరిస్సాకు 2500 క్యూసెక్కులు నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ట్ర అధికారులు అంగీకారం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఒడిశా పొట్టేరు ఇరిగేషన్‌ చీఫ్‌ కన్స్ట్రక్షన్‌ ఇంజనీర్‌ పితాబాస్‌ శెట్టి, ఎర్త్‌ డాం డివిజన్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ రమాకాంత పాత్ర, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తుసార్‌ రంజన్‌, కుంతియా ఎఇలులు గంగాధర్‌ ప్రధాన్‌, కెసి.ఫణి, బలిమెల హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ అధికారులు ఎ. శివప్రసాద్‌ జనరల్‌ మేనేజర్‌ జ్యోతిర్మయదాస్‌, ఆంధ్ర తరపున ఎస్‌ఇ కెకెవి. ప్రశాంత్‌కుమార్‌, ఇఇ ప్రభాకర్‌, డిఇఇ వెంకట మధు, ఎఇ సిహెచ్‌ సురేష్‌ పాల్గొన్నారు.

నీటి నిలువలు పై సమీక్షిస్తున్న ఆంధ్ర ఒరిస్సా రాష్ట్ర అధికారులు.

➡️