కూటమికి సర్దుపోట్లు

ప్రజాశక్తి – కడప ప్రతినిధికూటమికి సర్దుపోట్లు తప్పడం లేదు. టికెట్ల కేటాయింపుల్లో స్పష్టత కొరవడిన ఫలితంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి యనమల భాస్కర్‌రావు స్థానంలో అరవ శ్రీధర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టిడిపి జమ్మలమడుగు టికెట్‌ను బిజెపికి కేటాయించింది. అప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చిరపరిచితునిగా మారడం తెలిసిందే. టిడిపి అధిష్టానం టికెట్ల కేటాయింపుల్లో తొరదరపాటు నిర్ణయాలు తీసుకుంది. టిడిపి అభ్యర్థులు ఆశించిన స్థానాలను కూటమికి కేటాయించాల్సి వచ్చింది. జమ్మలమడుగు, రాజంపేట, రైల్వేకోడూరు స్థానాల్లో టిడిపికి పట్టు ఉంది. ఈ స్థానాలను కూటమి అభ్యర్థులకు వదులుకోవడంతో కూటమిలో అంతర్మథనం నెలకొంది. రాజంపేట అసెంబ్లీ టికెట్‌ను పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రచారం సాగిన సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించింది. రాజంపేట ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు ఆశించారు. రైల్వేకోడూరులో కూటమి అభ్యర్థి భాస్కర్‌రావు మార్పు అనివార్యంగా మారింది. వైసిపి అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నాలుగు దఫాలుగా గెలవడంతో వ్యతిరేకత కనిపిస్తోంది. టిడిపి అధిష్టానం అభ్యర్థిని బరిలో నిలిపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. టికెట్‌ను జనసేనకు కేటాయించింది. జనసేన ఎవరికీ తెలియని భాస్కర్‌రావు పేరును ప్రకటించింది. టికెట్‌ కేటాయింపు వ్యవహారం పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. సర్వే పేరుతో అరవ శ్రీధర్‌ పేరును ప్రకటించాల్సి వచ్చింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై అసంతృప్తి నెలకొంది. కూటమిలో అసంతృప్తు నెలకొంది. ఫలితంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేష్‌రెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. టిడిపి అధిష్టానం కూటమి తరుపున జమ్మలమడుగు టికెట్‌ను బిజెపికి వదులుకుంది. బిజెపి తరుపున మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బరిలో దిగనుండడం, భూపేష్‌రెడ్డిని పార్లమెంట్‌ బరిలో నిలపడంతో ఎక్కడో వ్యత్యాసం కనిపిస్తోంది. జమ్మలమడుగు వంటి ఫ్యాక్షన్‌ ప్రాంతంలో కూటమి ఓటర్లు పూర్తిస్థాయిలో కమలానికి బదలాయింపు కావడం ఎంతవరకు సాధ్యమనే అనే సందేహలూ ఉన్నాయి హోరాహోరీ పోరుతప్పని ప్రాంతంలో రెండు, మూడు శాతం ఓట్ల తేడాతో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మార్గాంతరమేమిటనే ప్రశ్న వేధిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజా ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థుల్లో మార్పుచేర్పులపై చర్చ నడిచే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

➡️