గోల్డెన్‌ అవర్‌ పై అవగాహన కల్పించండి

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి-పాడేరు:రహదారి ప్రమాదాలలో గోల్డెన్‌ అవర్‌ పై ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఆదేశించారు. ప్రమాదాలలో మొదటి గంట అత్యంత కీలకమని, ఆ గోల్డెన్‌ అవర్‌ లో అందించే ప్రధమ చికిత్సతో ప్రాణాలు కాపాడగలమని వివరించారు. బుధవారం కలక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలలో క్షత గాత్రులను గోల్డెన్‌ అవర్‌ సమయంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన ప్రాణ దాతలకు ప్రభుత్వం తరుపున ఐదు వేల రూపాయలు నగదు, దృవపత్రం అందించబడుతుందన్నారు. వాహన చోదకులకు డ్రైవింగ్‌ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు తగిన విధంగా వాహన చోదకులకు, ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఎస్‌పి తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివారు వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణీకులను అనుమతంచరాదని సూచించారు. ఎన్నికల సమయం నగదు, తాయిలాలు, గంజాయి, సారా రవాణా జరిగే అవకాశం ఉన్నందున డ్రైవర్లు మరింత జాగ్రత్త వహించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ బాషా, ప్రజా రవాణా శాఖ ఇంచార్జ్‌ డి.ఎం. ఉమా శంకర్‌ రెడ్డి, ఆర్‌ అండ్‌ బి ఇఇ బాల సుందర బాబు, పంచాయతి రాజ్‌ డిఇఇ వినయకుమార్‌ రెడ్డి, మెంబర్‌ సెక్రటరీ లీలా ప్రసాద్‌, రంపచోడవరం ఎంవిఐ ఆర్‌.రాజేష్‌ కుమార్‌, ఎఎంవిఐ వాసు పాల్గొన్నారు.శతశాతం ఉత్తీర్ణత సాధించాలి పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత సూచించారు. ఈ నెల 18వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం నేపధ్యంలో మంగళవారం తలారిసింగి, గుత్తులపుట్టు జి.టి.డబ్ల్యూ. ఆశ్రమ బాలికల ఉన్నత పాతశాలలను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్ధుల ప్రతిబా పాటవాలు, చదువు, ఉపాధ్యాయుల భోధనపై ఆరా తీశారు. మెనూ అమలు తీరును పరిశీలించారు. విద్యార్ధులు భవిష్యత్తులో ఏమి సాధించాలని అనుకుంటున్నారో ఆరా తీసిన కలెక్టర్‌, అనుకున్నది సాధించాలంటే పదవ తరగతే బేసిక్‌ అని తెలిపారు. పదవ తరగతిలో విద్యార్ధులందరూ బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎటిడబ్ల్యూఓ ఎల్‌. రజని పాల్గొన్నారు.

➡️