నేడే పోలింగ్‌

May 13,2024 00:00
అరుకు నుంచి వెళుతున్న సిబ్బంది

ప్రజాశక్తి- పాడేరు: ఈనెల 13న సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. అల్లూరి జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సిద్ధం చేసి ఉంచిన ఎన్నికల సామాగ్రిని ఈవీఎంలను ఆదివారం ఉదయం సిబ్బందికి పంపిణీ చేశారు. బస్సులు, జీపులు ఇతర వాహనాల్లో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు సామగ్రితో తరలి వెళ్లారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 318, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో 304, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 39 చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు ముందు రోజే సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో 610 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 5400 మంది పోలీసులతో పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లాలో 28 అరకు, 29 పాడేరు, 53 రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి ఆయా రిటర్నింగ్‌ అధికారుల ద్వారా పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలక్టర్‌ ఎం. విజయ సునీత పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్‌ రూముకు చేరుకున్న జిల్లా ఎన్నికల అధికారి కలక్టర్‌, సాధారణ పరిశీలకులు వివేకానందన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమును తెరచి ఇవిఎంలను, ఇతర సామాగ్రిని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జేసి భావన విశిష్ట్‌ ద్వారా పంపిణీకి ఏర్పాటు చేశారు. అదేవిధంగా అరకు చేరుకున్న జిల్లా ఎన్నికల అధికారి, సాధారణ పరిశీలకులు స్ట్రాంగ్‌ రూములో ఎన్నికల సామాగ్రిని అరకు రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు, కలక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. సోమవారం ఉదయం సంబంధిత పోలింగ్‌ కేంద్రాలలో తప్పనిసరిగా మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని ఓటింగ్‌ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించకుండా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో 7,71,193 మంది ఓటర్లు ఉన్నారని, అందుకు 1021 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 16 మంది, అరకు నియోజకవర్గంలో 17 మంది, రంపచోడవరం నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గంలో రిటర్నింగ్‌ అధికారి ఎస్‌. ప్రశాంత్‌ కుమార్‌, ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే, చింతూరు ఐటిడిఎ పిఒ చైతన్య, ఎఎస్పి జగదీష్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇవిఎంల గోడౌన్‌ తెరచి ఎన్నికల సామగ్రి పంపిణీ నిర్వహించారు.

➡️