బాధితులకు అండగా ఉంటా: ఆమంచి

ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ బాధితులకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని అనుమల్లిపేటలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సీనియర్‌ సిటిజన్‌ జాగాబత్తుని రమేష్‌, గౌరాబత్తుని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్‌ బ్యాంకు బాధితుల సమస్యల పరిష్కారంలో వారికి పూర్తిగా అండగా ఉంటానని తెలియజేశారు. రాజకీయ నాయకుల అండదండలతో బ్యాంకు చైర్మన్‌, డైరెక్టర్లు ఇష్టానుసారంగా రికవరీ సొమ్ముకు బాధ్యత వహించకుండా బాధితులను ఇబ్బంది పెడుతున్నారని, వారికి పూర్తిగా చట్టపరంగా న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని తెలియజేశారు. తదుపరి రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌ మాట్లాడుతూ సుమారు 600 కుటుంబాలు వారు బ్యాంకులో సొమ్ము పోగొట్టుకొని నష్టపోయారని అన్నారు. అనేకమంది చనిపోయారని, చాలామంది పేదవారు డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు బ్యాంకుకు సంబంధించిన వారు తన వ్యక్తిగత అవసరాల కోసం, ఆస్తిపాస్తులు పెంచుకునే దానికోసం వాటిని వాడుకొని అందరినీ బజారుపాలు చేశారని అన్నారు. బ్యాంకు బాధితులకు అండగా ఉంటున్న ఆమంచి కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని, తామంతా కలిసి ఆయనను గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షులు, చీరాల కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కొమరగిరి వెంకటప్రసాద్‌, వేటపాలెం జడ్పిటిసి బండ్ల తిరుమలాదేవి, బండ్ల బాబు, జెడ్‌ రమేష్‌, బ్రహ్మానందం, జి శ్రీనివాసరావు, పట్టాభి సేనాని మాస్టర్‌, సుధాకరరెడ్డి, రమణా రెడ్డి, ఎన్‌ వీరాంజనేయులు, రంగనాయకులు, ఆంజనేయులు, డి వెంకటేశ్వర్లు, దేవన జయరావు, మాణిక్యాలరావు, బాలాజీ, సుబ్బనాగులు, అరుణ్‌, సదాశివం, గంగాధరం బ్రహ్మం, వంక సురేష్‌, షేక్‌ సత్తార్‌, గాత్రం ఉమ పాల్గొన్నారు.

➡️