ఎస్మా రద్దు చేయాలి – జీతాలు పెంచాలి

Jan 11,2024 14:50 #anakapalli
anganwadi workers strike 31day in akp
  •  రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌
     వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఏకగ్రీవ తీర్మానం
    సంక్రాంతిలోపు తేల్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణ

ప్రజాశక్తి-అనకాపల్లి : అంగన్‌వాడీలపై విధించిన ఎస్మాను తక్షణమే రద్దుచేయాలని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి జీతాలను పెంచాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సంక్రాంతిలోపు ఈ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించాయి. ఉద్యోగ కార్మిక సంఘాల సమ్మెలకు మద్దతుగా సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యాన గురువారం దొడ్డి రామునాయుడు భవన్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీంవగా తీర్మానం చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిడిపి, సిపిఐ, కాంగ్రెస్‌, జనసేన, ఆప్‌, ఎటిపి పార్టీలతో పాటు సిఐటియు, రైతు, యువజన, దళిత బహుజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు లక్షల మందికి పైగా పిల్లలు, మహిళలు, గర్భిణీలకు సేవలందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో సేవలు పొందుతున్న లబ్దిదారులు ఎస్‌.సి,ఎస్‌.టి, బలహీన వర్గాలు, అసంఘటిత కార్మిక, పేద రైతు, వ్యవసాయ కార్మిక తదితర పేదలకు చెందినవారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణాలోకన్నా రూ.1000లు అదనంగా వేతనం పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని కోరుతూ సమ్మె గత 31 రోజులుగా నిర్వహిస్తున్నారు. వీరి న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా దుర్మార్గంగా ఎస్మాను ప్రయోగించింది. అంతకుముందే సెంటర్‌ తాళాలను పగలగొట్టడం, జనవరి 5లోగా విధులకు జాయిన్‌ కాకుంటే తొలగిస్తామని నోటీసుల్వివడం వంటి చర్యలకు పాల్పడిరది. అయినా అంగన్‌వాడీలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వెంటనే డ్యూటీలో చేరాలని అంగన్‌వాడీలకు డైడ్‌లైన్‌ విధించి బెదిరించడం హేయమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అబద్దాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. ఎస్మా ప్రయోగించినా కార్మికులు పట్టువీడటం లేదంటే వారి బాధ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అంగన్‌వాడీలు అత్యవసర విభాగం అని భావిస్తే ఇన్ని రోజులు ఎందుకు సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్‌కు శృంగభంగం తప్పదని, మహిళలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. సంక్రాంతిలోపు సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని పార్టీలు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతోపాటు, రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరించారు.

ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజాన దొరబాబు, జనసేన జిల్లా కార్యదర్శి పావాడ కామరాజు, టిడిపి జిల్లా నాయకులు వెంకటరావు, సిపిఐ జిల్లా నాయకులు వై.ఎన్‌.భద్రం, సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కట్టనూరి నూక అప్పారావు, ఆమ్‌ ఆద్మీ నాయకులు శ్రీనివాసరావు, ఆల్‌ తెలుగు ప్రజల పార్టీ నాయకులు రామచంద్రరావు, దళిత బహుజన సంఘం నాయకులు సూదికొండ మాణిక్యలరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కర్రి అప్పారావు, గండి నాయనబాబు, రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకరారావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.శివాజీ, డి.శ్రీనివాసరావు, నూకఅప్పారావు, బి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️