అంగన్‌వాడీలకు సర్కారు బెదిరింపులు..!

Jan 11,2024 21:31

గుమ్మఘట్టలో అంగన్‌వాడీ కేంద్రం గోడకు షోకాజ్‌ నోటీను అతికిస్తున్న ఐసిడిఎస్‌ సిబ్బంది

       అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలపై ప్రభుత్వం బెదిరింపుల పర్వం కొనసాగిస్తోంది. అన్ని విధాలుగా భయపెట్టి వారి సమ్మెను విచ్ఛన్నం చేసే కుట్రకు పూనుకుంటోంది. ఇప్పటికే అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. దీనికి వారు భయపడకపోవడంతో తాజాగా నోటీసులు అందించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా ఆయా మండలాల్లో అంగన్‌వాడీలకు ఐసిడిఎస్‌ సిబ్బంది ద్వారా నోటీసులు అందించి బెదిరించాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదంటూ అంగన్‌వాడీలు తెగేసి చెబుతున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాడు 31వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ సమ్మె నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరసన శిబిరాల్లో కూర్చొని వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఐసిడిఎస్‌ అధికారుల ద్వారా అంగన్‌వాడీలపై బెదిరింపులకు దిగుతోంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో అంగన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. వీటిని తీసుకునేందుకు అంగన్‌వాడీలు నిరాకరించడంతో అంగన్‌వాడీ కేంద్రాల తలుపులు, గోడలపై నోటీసులను అతికించి వెళ్తున్నారు. మారమూల గ్రామాలకు అయితే పోస్టల్‌ ద్వారా నోటీసులను పంపుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ బెదిరింపులపై అంగన్‌వాడీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సమ్మెను పరిష్కరించాల్సింది పోయి ఇలా బెదిరింపులకు దిగడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.

ఆది నుంచి బెదిరింపులే..

అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం ముందు నుంచే బెదిరింపులకు దిగుతోంది. సమ్మె ప్రారంభం కాగానే అధికారుల ద్వారా బెదిరించారు. దీనిని అంగన్‌వాడీలు ప్రతిఘటించారు. తరువాత సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీనిని కూడా అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. చివరకు ఈ నెల 8వ తేదీలోపు విధుల్లో చేరకుంటే ఎస్మాను ప్రయోగిస్తామని ప్రకటించారు. దీనికి కూడా బెదరకుండా అంగన్‌వాడీలు మొక్కవోని సంకల్పంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చి ఒత్తిడి తెచ్చేలా కుట్రలు చస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఈ నెల 8వ తేదీలోపు విధుల్లోకి ఎందుకు చేరలేదంటూ షోకాజ్‌ నోటీసుల ద్వారా కోరుతున్నారు. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటమాని కూడా బెదిరిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బెదిరింపుల వైఖరిపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ జిల్లా వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తూ పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు.

నేడు రౌండ్‌టేబుల్‌ సమావేశం

అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ 31 రోజులుగా చేస్తున్న సమ్మెను అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ శుక్రవారం నాడు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని కోరుతూ వారికి మద్దతుగా అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఉదయం 11గంటలకు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కోసం నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఇలా బెదిరింపు ధోరణలు అవలంభించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీలను చర్చలకు పిలిచి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. అంగన్‌వాడీల సమ్మెకు సంఘీభావం, ఎస్మా చట్టానికి నిరసనగా శుక్రవారం నాడు జరుగుతున్న రౌండ్‌టేబుల్‌ సమావేశానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌, న్యూ డెమోక్రసీ, ఎస్‌యుసిఐ, బీఎస్పీ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

➡️