అధికారుల తీరుపై పాలకమండలి సభ్యుల ఆగ్రహం

అధికారుల తీరుపై పాలకమండలి సభ్యుల ఆగ్రహం

సమస్యలపై అధికారులను నిలదీస్తున్న పాలకమండలి సభ్యులు

ప్రజాశక్తి-రాయదుర్గం

పట్టణంలో ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో అధికారుల తీరుపై పలువురు పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు పొరాళు శిల్ప అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు గోవిందరాజులు, బండి అజరు, పద్మజ, శ్రీలక్ష్మీ, ప్రశాంతి, పెద్ద వన్నూరప్ప తదితరులు మాట్లాడుతూ ప్రతినెలా కౌన్సిల్‌ సమావేశం జరిగి తీర్మానాలు చేసినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. సాధారణ నిధుల నుంచి బిల్లుల చెల్లింపునకు తీర్మానాలు చేసినప్పటికీ సాధారణ నిధులు ఎన్ని ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టారు? మిగులు ఎంత? అనే వివరాలు అధికారులు సభ్యులకు తెలపడం లేదన్నారు. పట్టణంలో అనేకచోట్ల వీధి దీపాలు వెలగడం లేదని, కొత్త బల్బుల కొనుగోలుకు తీర్మానం చేసి ఆరు నెలలు గడిచిన దీపాలు తెప్పించి ఎందుకు ఏర్పాటు చేయలేదని సభ్యులు నిలదీశారు. పట్టణ శివారు ప్రాంతాలు ముత్రాసు కాలనీ, గ్యాస్‌ గోడౌన్‌ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు లేక కాలనీవాసులు రాత్రిళ్లు పాములు, తేళ్లు ఇతర విష పురుగులు, కీటకాల బారిన పడుతున్నట్లు సభ్యురాలు శ్రీలక్ష్మి తెలిపారు. వట్లకుంట వద్ద తాగునీటి పైప్‌లైన్‌ కనెక్షన్‌ పని ఏళ్లు గడిచిన ఎందుకు పూర్తి చేయలేదని గోవిందరాజులు ప్రశ్నించారు. పట్టణంలో దోమల బెడద అధికంగా ఉన్నప్పటికీ వాకింగ్‌ మిషన్‌ ఉన్నప్పటికీ దానిని వాడక మూలన పెట్టేశారని సభ్యురాలు పద్మజ ఆరోపించారు. కౌన్సిల్‌ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా ఎందుకు వారు సమావేశాలకు రావడంలేదని సభ్యులు ప్రశ్నించారు. పారిశుధ్యం మెరుగుకు వార్డుకు ఒకరు చొప్పున తాత్కాలిక సిబ్బందిని నియమించాలని సభ్యురాలు ప్రశాంతి కోరారు. అజెండాలోని ఒక అంశం మినహా ఇతర అన్ని అంశాలకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ మాలిక్‌, మున్సిపల్‌ వైస్‌ఛైౖర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, పాలకమండలి సభ్యులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️