ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

దీక్షలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించడంతోపాటు ధీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 2వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. సిఎం జగన్‌ అనుసరిస్తున్న విధానం సరికాదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేరనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. చర్చలు జరిపి సాధ్యమైనంత తొందరగా ఆర్థిక బకాయిలు చెల్లించాలన్నారు. అలాకాదని వ్యతిరేకత మూతకట్టుకుంటామంటే అధికారానికి దూరం కావాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో పెట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు దిగిరావాలంటే ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ‘ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌’ అనే పోస్టర్లను ఆవిష్కరించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఏపీజిఎల్‌ఐ సొమ్ములను ఉద్యోగులకు తెలియకుండానే ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. 12వ పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా, కేవలం కమిటీని నియమించి చేతులు దులుపుకుందని విమర్శించారు. 12వ పిఆర్‌సి అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంత వరకూ 30శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు రామప్ప, జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, జిల్లా కార్యదర్శులు హనుమంతురెడ్డి, అర్జున్‌, రవికుమార్‌, రఘురామయ్య, సంజీవ్‌ కుమార్‌, శేఖర్‌ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

➡️