ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే : ఇఆర్‌ఒ

ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే : ఇఆర్‌ఒ

సమావేశంలో మాట్లాడుతున్న ఇఆర్‌ఒ కరుణకుమారి

ప్రజాశక్తి-రాయదుర్గం

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాల్సిందేనని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ కరుణకుమారి సూచించారు. శనివారం రాయదుర్గంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగానే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. ముఖ్యంగా పోటీలో ఉండే వివిధ పార్టీల అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. అభ్యర్థులు నాలుగు సెట్ల నామినేషన్లు, అఫిడవిట్‌తో పాటు సమర్పించాలన్నారు. నామినేషన్ల వివరాలు ఏరోజుకారోజు నోటీసు బోర్డులో ప్రదర్శిస్తామన్నారు. బ్యాలెట్‌లో అభ్యర్థుల పేర్లు గుర్తులు తప్పులు లేకుండా సరైన సమాచారం ఇవ్వాలన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును పరిశీలించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల విధులు ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయిలో తహశీల్దార్లు, మున్సిపాలిటీలో కమిషనర్‌ సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. స్థిరమైన నిఘా బృందాలు మూడు షిఫ్ట్‌లలో నియోజకవర్గంలో వ్యక్తులు, పార్టీలు, వాహనాల కదలికలపై నిఘా పెడతాయన్నారు. నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నేపథ్యంలో 8చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఐదు మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️