‘ఎస్మా’ను తిప్పికొడతాం..!

Jan 9,2024 09:56

అనంతపురం కలెక్టరేట్‌ సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీలు

           అనంతపురం కలెక్టరేట్‌ : ‘కడుపుమండి హక్కుల సాధన కోసం రోడ్లెక్కాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఎస్మా ప్రయోగించి బెదిరించడం దుర్మార్గం.. ఇలాంటి వాటికి భయపడేది లేదు.. ఐక్య పోరాటంతో ఎస్మాను తిప్పికొడతాం’ అని అంగన్‌వాడీలు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాడు 28వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో వినూత్న పద్ధతుల్లో నిరసనలు తెలిపారు. ఎస్మా ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టడం, మెడలో ఉరితాళ్లు వేసుకుని తదితర రూపాల్లో నిరసనలు తెలిపారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా విధించడాన్ని నిరసిస్తూ మూడు రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఒక్కొక్క రోజు 12 మంది చొప్పున కార్మికులు 24 గంటల పాటు పస్తులుంటూ శిబిరంలో ఎముకలు కొరికే చలిలోనే నిద్రిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. సోమవారం నాటి దీక్షలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, జనసేన పార్టీ జిల్లా నాయకులు బాబురావు, భవాని రవికుమార్‌, సిపిఐఎంఎల్‌ జిల్లా నాయకులు చంద్రశేఖర్‌, సిపిఎంఎంల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు దాదాగాంధీ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య, ఎస్‌యుసిఐ నాయకులు నాగముత్యాలు, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీల హక్కులు అమలు చేయమని అడుగుతుంటే ఎస్మా ప్రయోగించడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. అంగన్‌వాడీలు కోరుతున్న ఆర్థిక పరమైన ప్రధాన డిమాండ్లను కాదని ఇతర అంశాలపైనే ప్రభుత్వ పెద్దలు చర్చలు జరపమనడం వారి ద్వంద నీతికి అద్దం పడుతోందన్నారు. మహిళలు రోడ్లపై వచ్చి పోరాడుతుంటే కనీసం ప్రజాప్రతినిధులుగా ఎవ్వరూ కూడా వచ్చి పరామర్శించిన పోపాన పోలేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని రాబోవు రోజుల్లో అధికార పార్టీ నాయకులు ఓట్లు అడుగుతారని విమర్శించారు. ప్రభుత్వానికి పోలీసుల పహారాలో చట్టాలు అమలు చేస్తూ అన్ని వర్గాలనూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ తప్పులను సరి చేసుకోవాల్సింది పోయి, మొండిగా వ్యవహరించే ధోరణి చూస్తుంటే వైసిపి ప్రభుత్వానికి పతనం అయ్యే గడియలు దగ్గరపడ్డాయని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున మాట్లాడుతూ ఎస్మాతో కార్మికులను తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో మా ఓట్లతో ప్రభుత్వాన్ని తొలగించే శక్తి అంగన్‌వాడీలకు ఉందన్న సత్యాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. వేతనాలు పెంచి సమ్మె విరమింపజేస్తే సరి, అలా కాదని ఎస్మాలతో బెదిరిస్తామంటే భయపడేది లేదన్నారు. సమ్మెలోకి దిగకముందే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం అయ్యామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రామాంజినేయులు, ముత్తుజా, అంగన్‌వాడీ కార్మికుల యూనియన్‌ నగర అధ్యక్షురాలు జయభారతి, అరుణమ్మ, రుక్మిణి, కాత్యాయని, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు.

➡️