నేడు ‘సామాజిక సాధికార యాత్ర’ : ప్రభుత్వ విప్‌

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-రాయదుర్గం

పట్టణంలో మంగళవారం(నేడు) వైసిపి నిర్వహించతలపెట్టిన సామాజిక సాధికార యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, శ్రేయస్సుకు సిఎం జగన్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. క్యాబినెట్‌లో మంత్రి పదవులు, వివిధ కార్పొరేషన్లలో ఛైర్మన్‌, పాలకు మండలి పదవులు ఇచ్చారన్నారు. టిడిపి బిసిలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని, చంద్రబాబు పాలనలో ఒకే సామాజిక వర్గానికి అధికారం కట్టబెట్టిందన్నారు. 2024లో జరిగేవి టిడిపికి చివరి ఎన్నికలు అన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు 2019 ఎన్నికల తర్వాత రాయదుర్గంను మరచిపోయారని, ఇప్పుడు కూడా ఎన్నికల సందర్భంగా అంబేద్కర్‌ వర్ధంతి గుర్తుకు వచ్చిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బిసిలు, మైనారిటీలకు ఏం చేశామో వివరాలు ఇస్తాం, టిడిపి హయాంలో ఏం చేశారో చెబుతారా అని కాలవకు సవాల్‌ చేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు జగన్‌ వెంటే ఉన్నారని, టిడిపి చేసే బూటకపు నాటకాలు, ఆటలు సాగవన్నారు. సమావేశంలో గౌని ఉపేంద్రారెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పొరాలు శిల్ప, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్‌, వలిబాషా, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షులు అరవ శివప్ప, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

➡️