భర్త దారుణహత్య…తట్టుకోలేక గుండెపోటుతో భార్యమృతి

మూర్తిరావు, శోభ దంపతులు (ఫైల్‌ ఫొటో)

       అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌కె యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పని చేస్తున్న వ్యక్తిని ఆయన మేనల్లుడు ఆదివారం రాత్రి కత్తితో పొడి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యను కళ్లారా చూసిన ఆయన భార్య గుండెపోటుతో సోమవారం వేకువజామున మృతి చెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పామిడి మండల కేంద్రానికి చెందిన మూర్తిరావు గోఖలే(59), ఆయన భార్య శోభ(56)లు అనంతపురంలోని జెఎన్‌టియు కళాశాల వద్ద ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూర్తిరావు గోఖలే అనంతపురం సమీపంలోని అనంత లక్ష్మి ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ పని చేసేవాడు. ఇటీవల ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఎస్‌కె యూనివర్సిటీలో ప్రయివేటు అధ్యాపకునిగా పని చేస్తున్నారు. ఆయన భార్య శోభ శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరి ఉన్నత పాఠశాలలో బయాలజీ సహాయకురాలిగా పని చేస్తున్నారు. కాగ మూర్తిరావు గోఖలేకు తన అక్క కుమారుడు ఆదిత్యతో గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. మూర్తిరావు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించక, డబ్బులూ వెనుక్కు ఇవ్వకపోవడంతో ఆదిత్య ఆయనపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆదిత్య వివాహానికి సంబంధించిన ఇతర సమస్యలూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య ఆదివారం రాత్రి మూర్తి రావు ఇంటికి వచ్చాడు. డబ్బులు, ఉద్యోగం విషయంపై ఆయనతో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణ అధికమై అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆదిత్య మూర్తిరావును దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న మూర్తి రావు భార్య శోభ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను పక్కకు నెట్టేశాడు. తీవ్ర రక్తస్రావం అయిన మూర్తిరావు ఘటనా స్థలంలోనే మరణించాడు. కళ్లేదుటే భర్త మరణాన్ని చూసిన శోభ షాక్‌కు గురై అస్వస్థతకు లోనయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం వేకువజామున మరణించింది. ఒకే సారి భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. హత్యకు పాల్పడిన నిందితుడు ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

➡️