మహిళ మృతి కేసులో ముగ్గురు అరెస్టు

విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ రాఘవరెడ్డి

         అనంతపురం : అనంతపురం నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట అంజలి(29) అనే మహిళ ఆకలితో చనిపోయిందని రెండు రోజుల క్రితం పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై ఆలస్యంగా స్పందించిన పోలీసు యంత్రాంగం ఘటనపై సమగ్ర విచారణ జరిపి వివరాలను సేకరించారు. మంగళవారం రాత్రి అనుమానాస్పద కేసు నమోదు చేశారు. బుధవారం నాడు అంజలి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ఖననం చేసిన అంజలి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆమె ఆకలితోకాకుండా భర్త కొట్టడంతోనే చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఇందులో భర్తతోపాటు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీనికి సబంధించిన వివరాలను అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వివరాలను వెల్లడించారు. మృతురాలు అంజలి భర్త రాజు తాగుడుకు బానిసై కుటుంబ పోషణను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీన్ని ఆసరాగా చేసుకుని బేల్దారి దస్తగిరి, బేల్దారి బాలులు మంచి జీవితాన్ని కల్పిస్తామని అంజలినిని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేసినట్టు డీఎస్పీ రాఘవరెడ్డి తెలిపారు. అదే క్రమంలో ఈనెల 23వ తేదీ ఉదయం బాలు, దస్తగిరిలు ఆటోలో అంజలిని తీసుకెళ్లి కొన్ని గంటల తరువాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయంలో అంజలి భర్త రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి అంజలితో గొడవపడ్డాడు. నిత్యం మద్యానికి బానిసై పనికెళ్లకుంటే కుటుంబ పోషణ ఎలాగని, అందుకే తాను బేల్దారి పనికెళ్లి వచ్చానని అంజలి చెప్పింది. అదే సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అంజలిపై భర్త రాజు దాడి చేశాడు. తీవ్రకొట్టడంతో గాయాలపాలైన అంజలి మృతి చెందింది. మృతి చెందిన తీరును చూసి ఆమె అకలి బాధతో మరణించినట్లు ప్రచారం అయ్యింది. ఈ ఘటన ప్రచారం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన ప్రకారం భర్త రాజు, నమ్మించి మోసం చేసిన దస్తగిరి, బాలులపైనా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.

➡️