సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం

సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం

సచివాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, తదితరులు

ప్రజాశక్తి-శింగనమల

సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఈస్ట్‌ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ గోదాము భవనాలు, సలకంచెరువులో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సచివాలయ వ్యవస్థ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వెళ్లకుండా, విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ఇంటి దగ్గరకే వైద్యుల్ని పంపిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతన్నలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం వైసిపి అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ బొమ్మన శ్రీరామిరెడ్డి, ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్‌ లిఖిత, ఎపి నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ ప్రమీల, ఎంపిపి యోగేశ్వరి, నాయకులు బొమ్మన భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చెవిరెడ్డి, కల్లుముడి కొండయ్య, బంగారు అలిబాషా, నాగవర్ధన్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, కోరే రాముడు, వైస్‌ ఎంపిపి గాండ్ల నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

➡️