చనిపోయినా బతకడమే కమ్యూనిజం

చనిపోయినా బతకడమే కమ్యూనిజం

కామ్రేడ్‌ సుబ్బారెడ్డికి నివాళులర్పిస్తున్న సిపిఎం, రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌

‘ఓ వ్యక్తి కుటుంబం కోసం పని చేస్తే ఆ కుటుంబం మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది.. అదేవ్యక్తి కుటుంబంతోపాటు సమాజానికి పని చేస్తే ఆయన చనిపోయిన తర్వాత సమాజం కూడా గుర్తిస్తుంది.. ఇదే కమ్యూనిజం..’ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, విప్లవ రచయితల సంఘం సంఘం సభ్యురాలు విరసం వరలక్ష్మి అన్నారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత గురువావరం యల్లనూరు మండలం వెన్నపూసపల్లి గ్రామంలో సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్‌ సుబ్బారెడ్డి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కడప జిల్లాలో యురేనియం ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో నాడు ప్రజాభిప్రాయ సేకరణ కోసం విరసం సభ్యులుగా వెళ్తే.. అక్కడ కనబడిన మొట్టమొదటి నాయకుడు కామ్రేడ్‌ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాత్ర చాలా ఉందన్నారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో అధికార పక్షం అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ భయపడకుండా నిలబడిన వ్యక్తి సుబ్బారెడ్డి అని గురు చేశారు. పులివెందుల ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలను సుబ్బారెడ్డి ఎంతగానో ప్రోత్సహించారన్నారు. కమ్యూనిస్టులు ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారన్నారు. ఇందుకు కామ్రేడ్‌ సుబ్బారెడ్డి కుటుంబం ఉదాహరణ అన్నారు. ఎందుకంటే మూడు తరాలుగా వారు కమ్యూనిస్టులుగా కొనసాగుతున్నారన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలతో కొనసాగుతున్న కామ్రేడ్‌ సుబ్బారెడ్డి కుటుంబం నుంచి మనం ఎంతో గ్రహించాలన్నారు. పుట్టుక, చావు మధ్యలో సమాజం కోసం ఎంతో కొంత చేయగలగాలి అనేది ఒక కమ్యూనిస్టుకు మాత్రమే సాధ్యమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సుబ్బారెడ్డి దాదాపు 18 నెలలు జైల్లోనే ఉన్నారన్నారు. 1973 నాటి ఎమర్జెన్సీ మళ్లీ ప్రస్తుత బిజెపి ప్రభుత్వంలో వచ్చే అవకాశాలను చూస్తున్నామన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలు తమ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రకటించకపోవడం కేంద్రంలోని మోడీ కారణమనానరు. ఎందుంటే ఇక్కడ అమలు చేస్తే ఇదే అంశాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అడిగే అవకాశం ఉందని, దానివల్ల కేంద్రంలో ఉన్న బిజెపికి నష్టమని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ఢిల్లీ రైతుల పోరాటంతో బిజెపి ఉలిక్కిపడుతోందన్నారు. భవిష్యత్తు రోజుల్లో రైతులు ఒక కూటమిగా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రభుత్వాలను నిలదీస్తే తప్ప రైతాంగం కోలుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల నాయకులు సృజన్‌, రైతు సంఘం నాయకులు రాజారామిరెడ్డి, రమేష్‌, ఓబులేష్‌ కామ్రేడ్‌ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, పలు గ్రామాలకు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

➡️