వివరాలు బహిర్గతం చేయాలి

Mar 11,2024 14:36 #Anantapur District
Details should be disclosed

ఎన్నికల బాండ్లపై సిపిఎం మండల కన్వీనర్లు మధుసూదన్, విరుపాక్షి

ప్రజాశక్తి-ఉరవకొండ : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని ఉరవకొండ, వజ్రకరూర్ మండల కేంద్రాలలోని స్టేట్ బ్యాంక్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన పిలుపులో భాగంగా ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నా ముఖ్య ఉద్దేశం గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి ఆరవ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని సుప్రీంకోర్టు గత నెలలో మూడు వారాలు గడువిస్తూ తీర్పునిచ్చిందన్నారు. కొనుగోలు చేసిన ఈ బాండ్ల ద్వారా ఏఏ పార్టీలకు ఎంత మొత్తం వెళ్ళాయో మార్చ్ 13 నాటికి ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలని ఆ తీర్పు స్పష్టంగా ప్రకటించిందని, అయితే ఈ వివరాలను ఇవ్వడానికి ఎస్బిఐ ఉన్నత స్థాయి అధికారులు సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఈ వివరాలు ఇవ్వడానికి తమకు జూన్ 30 వరకు సమయం కావాలని మూడు వారాల గడువు ముగుస్తున్న చివరి రోజు ఎస్బిఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించకపోవడమే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తమ కార్యకలాపాలు అన్నిటిని డిజిటలైజ్ చేసిన ఎస్బిఐ సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని మూడు వారాల్లో అందివ్వకా లేకపోవడం అసాధ్యం కాదన్నారు. కోర్టు అడిగిన సమాచారాన్ని బయటకు రావడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అండగా నిలిచి అక్రమంగా వేలకోట్ల విరాళాలు ఇచ్చిన కొన్ని కార్పోరేట్ కంపెనీలకు ఉన్న బంధం బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని బహిర్గతం కాకుండా కొన్ని బలమైన శక్తులు అడ్డుకుంటున్నాయని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.అనంతరం ఇంచార్జ్ మేనేజర్ పరమేశప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉరవకొండ,వజ్రకరూర్ మండల కన్వీనర్లు మధుసూదన్, విరుపాక్షి, సిపిఎం జిల్లా నాయకులు రంగారెడ్డి, స్థానిక నాయకులు రామాంజనేయులు నాయక్, సిద్ధప్ప, వెంకటేశులు, మురళి, రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్ నాయకులు శంకర్, సుధా తదితరులు పాల్గొన్నారు.

➡️