ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివద్ధి చేసి చూపుతా..

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివద్ధి చేసి చూపుతా..

ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులు

ప్రజాశక్తి-ఉరవకొండ

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి అభ్యర్థించారు. ఆదివారం విడపనకల్‌ మండల పరిధిలోని వేల్పుమడుగు, మల్లాపురం గ్రామాల్లో వామపక్షాల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఈనేపథ్యంలో ప్రజా సమస్యలు తీర్చాలంటే కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలన్నారు. నన్ను గెలిపించిన తర్వాత మీ సమస్యలు రెండేళ్లలో తీర్చకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాడుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా, ఉపాధి కూలీలకు రూ.400 కూలి పెంచుతామని, మహాలక్ష్మి పథకం కింద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి రూ.లక్ష, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతుకు పంట గిట్టుబాటు ధర కల్పిస్తామని, కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందిస్తామన్నారు. కాగా ఉరవకొండ మండల పరిధిలోని వ్యాసాపురం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వై.మధుసూదన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన గోవిందప్ప, మల్లప్ప, వన్నూరుస్వామి, తిప్పన్న, హనుమంతప్ప, గంగిరెడ్డి, ఎర్రిస్వామి, సురేష్‌, రాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి చెన్నారాయుడు, కాంగ్రెస్‌ నాయకులు సీనా పాల్గొన్నారు.

➡️