‘పోస్టల్‌’ ఓటుకు నోటు..!

పోస్టల్‌ బ్యాలెట్‌లకు డబ్బులు పంపిణీ చేస్తున్న వైసీపీ వాహనాన్ని అడ్డుకుంటున్న టిడిపి శ్రేణులు

      కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గంలో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ సమీపంలో కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ శివ వైసిపి అభ్యర్థి తలారి రంగయ్యతో కుమ్మక్కై పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కొనుగోలు చేస్తున్నారంటూ టిడిపి నాయకులు ఆరోపించారు. కానిస్టేబుల్‌ డబ్బులు పంచడాన్ని ప్రత్యక్షంగా చూసి ఆతన్ని నిలదీశారు. డబ్బులు పంచుతున్న కానిస్టేబుల్‌ను నిలువరించేందుకు టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుమారుడు అమిలినేని యశ్వంత్‌ ప్రయతించాడు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసిపి నాయకులు కలుగుజేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం అయ్యింది. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలోనే వైసిపి నాయకులు రాళ్ల దాడి చేశారు. అక్కడే ఉన్న పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ నరసింహకు రాళ్ల దెబ్బలు తగిలాయి. వైసీపీ నాయకులు స్కార్పియో వాహనంలో డబ్బులు ఉంచుకుని పంపిణీ చేస్తున్నట్లు గుర్తించిన టిడిపి నాయకులు పోలీసుల సమక్షంలోనే అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సుమారు గంటపాటు ఘర్షణ వాతావరణం జరిగింది. పరిస్థితి తీవ్రం కావడంతో డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు నాగరాజు, హరినాథ్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. టిడిపి, వైసిపి మద్దతుదారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కానిస్టేబుల్‌ శివను వెంటనే సస్పెండ్‌ చేయాలని, వైసిపి నాయకుల దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఒ, డీఎస్పీలకు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు.

అంగన్‌వాడీలపై ఒత్తిడి…

అడ్డుకున్న టిడిపి నాయకులు

         పోస్టల్‌ బ్యాలెట్లు వేసేందుకు అంగన్వాడీ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద క్యూ కట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పొందేందుకు టిడిపి, వైసిపి నాయకులు పోటీ పడ్డారు. ఓటుకు రూ.3000 ఇస్తామని బహిరంగంగానే పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీల మద్దతుదారులు డబ్బులు ఎర వేశారు. ఈ సమయంలో కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టిడిపి, వైసిపి నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. స్థానిక సిడిపిఒ శ్రీదేవి వైసిపి అభ్యర్థి తలారి రంగయ్య జిల్లా వాసి కావడంతో ఆయనకు మద్దతుగా అంగన్వాడి ఉద్యోగులపై ఆమె ఒత్తిడి చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సిడిపిఒను పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటర్‌ నుంచి తొలగించాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. కాగా అంగన్వాడి ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓటు వేసేందుకు వివిధ శాఖల ఉద్యోగులు క్యూ కట్టారు.

➡️