అదే కష్టం..!

పుట్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద మండుటెండలో పింఛను కోసం వేచి ఉన్న వృద్ధులు

    పుట్లూరు, నార్పల : పింఛనుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పింఛన్‌ సొమ్మును ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ఈ పరిస్థితుల్లో ఖాతాలో పడిన సొమ్మును తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఆపసోపాలు పడుతున్నారు. శుక్రవారం నాడు కూడా బ్యాంకుల వద్ద పింఛన్‌దారుల పడిగాపులు కన్పించాయి. మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ గంటల తరబడి పింఛనుదారులు వేచి ఉన్నారు. ఈ మండల వ్యాప్తంగా 4003మందికి బ్యాంక్‌ ఖాతాల్లో పింఛన్లు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరు మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకున్నారు. చాలా మంది ఖాతాలు పని చేయకపోవడం, ఏ ఖాతాలో డబ్బులు పడిందో తెలియకపోవడం, ఈకేవైసీ తదితర సమస్యలతో డబ్బులు తీసుకోవడం సాధ్య పడలేదు. ఇక గ్రామాల్లో బ్యాంకులు లేకపోవడంతో మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో ఆటోల్లో మండుటెండల్లో ప్రయాణం చేసి మండల కేంద్రంలోని బ్యాంకుల వద్దకు రావాల్సి వస్తోంది. అక్కడ పింఛను సొమ్ము తీసుకోకపోవడం వీలుకాకపోవడంతో వృద్ధులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

   నార్పల : పింఛను డబ్బులు తీసుకునేందుకు నార్పల మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ వద్దకు పెద్ద ఎత్తున వృద్ధులు, మహిళలు శుక్రవారం వచ్చారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో స్టేట్‌ బ్యాంకు బయటనే వద్ధులు, మహిళలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిందో లేదో తెలుసుకునేందుకు కూడా సరైన అవగాహన లేని వృద్ధులు అక్కడ కన్పించిన ప్రతి ఒక్కరినీ సాయం కోరుతున్నారు. బ్యాంకు అధికారులు స్పందించి పింఛన్‌ సొమ్ము వృద్ధులకు త్వరితగతిని అందించే ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️