షోకాజ్‌ నోటీసులకు సమాధానమిచ్చిన అంగన్వాడీలు

Jan 17,2024 16:39 #Anganwadi strike, #Kakinada
  •  సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వెల్లడి

ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కాకినాడ కలెక్టరేట్‌ దగ్గర 37 రోజుల నుంచి నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈనెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ నాయకత్వంతో చర్చలు జరిపి డబ్బులు ఉన్నా గాని వేతనాల పెంచలేమని చెప్పడం చాలా దారుణం అన్నారు. ఐదేళ్లకోసారి వేతనాలు పెంచాలి అనే పాలసీని నిర్ణయించుకున్నామని చర్చలకు వచ్చిన మంత్రులు, అధికారులు చెప్పడం శోచనీయమన్నారు. ఐదేళ్లకొకసారి వేతనం పెంచితే ధరలు కూడా ఐదేళ్లకు ఒకసారి పెంచుతున్నారా అని ప్రశ్నించారు. ఐదేళ్లకు ఒకసారి వేతనాలు పెంచడానికి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, ఇతర బెనిఫిట్‌ లు కూడా వీళ్లకు వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌లకు బుదవారం అంగనవాడిలంతా డైలీ ఫామ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా వెళ్లి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కి సమాధానంతో కూడిన నోటీసులను వ్యక్తిగతంగా ఎవరికి వారు ఇచ్చి నకలు కాపీను తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, అంగన్వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జి.రమణమ్మ, రమ, నీరజ, మున్ని, రాజేశ్వరి, బాంధవి, సరోజ, విజయ, రమ మొదలైన వారు పాల్గొన్నారు.

➡️