అరుదైన చిత్రకళా ప్రదర్శనలో నాయిని గిరిధర్

Feb 16,2024 10:43 #Annamayya district
giridhar paiting

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : హైదరాబాద్ నగరంలో సాలార్ జంగ్ మ్యూజియంలో మాస్టర్ స్ట్రోక్ -3 గ్రూపు షో పేరిట అంజి అకొండి క్రియేటివ్ హార్ట్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక చిత్ర కళా ప్రదర్శనలో రాజంపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు నాయిని గిరిధర్ చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 53 మంది చిత్రకారుల 70 కళా ఖండాలు ఈ షోలో ప్రదర్శించగా గిరిధర్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కొనసాగిన ఈ ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ క్రిఐటివిటీ కల్చరల్ కమిషన్ కార్యదర్శి జోగినాయుడు, నీవెవరు, లవర్స్ చిత్రాల దర్శకుడు హరినాథ్,పుష్ప సినిమా లుక్స్ డిజైనర్ ఎం.లక్ష్మీనారాయణ చిత్రకళా ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ కళారూపాలు ఈ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి నాయిని గిరిధర్ కుంచె నుంచి జాలువారిన పాల పాత్రలతో బిడియం, అమాయకత్వం కలగలిపి నిలిచున్న గ్రామీణ బాలిక చిత్రం, భుజాల మీద చేతులు వేసుకొని స్నేహభావాన్ని ప్రకటిస్తున్న బాలికల చిత్రాలు మ్యూజియంకు విచ్చేసిన వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజంపేటకు చెందిన కళాకారుడు గిరిధర్ తో పాటు ఆయన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రశంసలు., నిర్వాహకుల నుంచి సత్కారం అందుకోవడం ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమని రాజంపేట వాసులు మురిసిపోతున్నారు.

➡️