అమరావతికి పూర్వవైభవం

Jun 19,2024 23:03

గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాయపూడిలో నిర్మాణం చేపట్టిన ఐఎఎస్‌, ఐపిఎస్‌ల గృహ సముదాయం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఆల్‌ఇండియా సర్వీసెస్‌ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్‌ నిర్మాణాల కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలించనున్నారు. సిఆర్‌డిఎ కార్యాలయాన్ని సందర్శించి తరువాత మీడియాతో మాట్లాడి వెలగపూడి సచివాలయానికి వెళ్తారని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. వైసిపి హయాంలో ఐదేళ్లపాటు రాజధాని పనులు నిలిచిపోయిన నేపథ్యంలో తిరిగి పనులు ప్రారంభించేందుకు రూపొందించాల్సిన కార్యచరణ ప్రణాళికపై అధికారులతో చర్చిస్తారు. తక్షణం చేపట్టాల్సిన పనులు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షిస్తారు.80 శాతం పూర్తయిన భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాబోయే ఆరునెలల్లో వీటిని వినియోగంలోకి తేవాలని యోచిస్తున్నారు. 8603 కిలో మీటర్ల పరిధిలో సిఆర్‌డిఎ ఏర్పాటు చేశారు. 217 కిలో మీటర్ల మేరకు కోర్‌ కేపిటల్‌గా నిర్థారించారు. రూ.225 కోట్లతో నిర్మించిన ఆరులైన్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు జాతీయ రహదారికి అనుసంధానం కాకుండా అసంపూర్తిగా ఉండిపోయింది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.9, 165 కోట్లు వెచ్చించారు. పనులు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. 2019 మే నాటికి పురోగతిలో ఉన్న పనులన్నీ ఎక్కడికక్కడ నిలిపివేశారు. కాంట్రాక్టర్లు అంతా వెనుదిరిగారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సిఎం జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. వెంటనే ఏకైక రాజధాని అమరావతినే ప్రకటించాలని రైతులు 1632 రోజులు ఉద్యమించారు. ప్రధానంగా రాజధాని గ్రామాల్లో భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు అప్పగింత ఇంతవరకు జరగలేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు కాగితాలపై ప్లాట్లు అప్పగించారు. మొత్తం 54 వేల ప్లాట్లు భౌతికంగా అప్పగించలేదు. 26 రెవెన్యూ గ్రామాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వాల్సి ఉంది. 29 గ్రామాల పరిధిలో 22,948 మంది రైతులకు 28,128 ఎకరాల భూమికి రూ.183.17 కోట్లు కౌలు పరిహారం గతేడాది చెల్లించలేదు. ఈ ఏడాది కూడా ఇంత వరకు చెల్లింపులు జరగలేదు. మొత్తం రూ. 366.34 కోట్లు తక్షణం రైతులకు చెల్లించాల్సి ఉంది. 2016 నుంచి కౌలు చెల్లింపులు ప్రారంభించింది. 2026 వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 29 గ్రామాల్లో 3 వేల మంది అసైన్డు రైతులున్నారు. మొత్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు గ్రహణం వీడింది. టిడిపి రెండోసారి అధికారంలోకి రావడంతో అమరావతికి పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు.

➡️