ఉపాధి పనులు చేసిన కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలి : ఎపి వ్యవసాయ కార్మిక సంఘం

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ (మన్యం) : ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లించాలని రేపు జూలై 1వ తేదీన ఎంపీడీవో ఆఫీసుల వద్ద ధర్నా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం జిల్లా కార్యదర్శి కోల్లి గంగు నాయుడు మాట్లాడుతూ …. ఉపాధి కూలీలు గత మూడు నెలలుగా ఎండలో ఎండి రోజుకు రెండు పూటలా ఉదయం సాయంత్రం పనిచేస్తే సుమారు ఐదు వారాల బిల్లులు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. గత ఆరు మాసాలుగా అటు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు కూలి రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రెండు పూటలా పనిచేయడం వల్ల కూలీలు రోజుకు పది కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తుందని దానివలన కూలీల ఆరోగ్యం దెబ్బతింటుందని, వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి తీవ్ర ఆటంకంగా మారిందని అన్నారు. కాబట్టి రెండు పూటలా పనిని రద్దుచేసి ఒక్క పూట పని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాంత్రికరణ పెరగడం వలన వ్యవసాయంలో పని దినాలు భారీగా తగ్గాయని అందుకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు కూలి 400 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాత పద్ధతి లాగా మేట్లకు ప్రోత్సాహం ఐదు రూపాయలు ఇవ్వాలని, పారా, పలుగు తట్ట మెయింటెనెన్స్‌ కు డబ్బులు వేయాలని, మజ్జిగ, మంచినీరు కూలీలకు సరఫరా చేయాలని మెడికల్‌ కిట్‌ లు ఇవ్వాలని, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై రేపు సోమవారం జూలై 1వ తేదీన ఎంపీడీవో ఆఫీసుల వద్ద ధర్నా ఉన్నదని దానికి ఉపాధి కూలీలంతా రావాలని కోరారు.

➡️