పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగుల ఆగ్రహం – కనీసం టిఫిన్లు కూడా..!

May 12,2024 11:17 #anger, #Employees, #Polling centers

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉదయం ఏడు గంటలకు వచ్చేశాం, ఇంత వరకు పోలింగ్‌ కేంద్రాలు కేటాయింపు ఆర్డర్లు ఇవ్వలేదు, ఎప్పుడు ఆర్డర్లు ఇస్తారు, మెటీరియల్‌ ఎప్పుడు తీసుకోవాలి, మెటీరియల్స్‌ సరిపోయాయా ? లేదా అనేది చూసుకొని ఎప్పుడు వెళతామని విజయనగరం నియోజకవర్గం ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు వచ్చిన నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి 10.30 గంటలు అవుతున్నప్పటికీ ఇంత వరకు పోలింగ్‌ కేంద్రాల కేటాయింపు జరగలేదు. దీంతో ఉద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎప్పుడు వెళతాం అని ఆవేదన చెందుతున్నారు. పోలింగ్‌ కేంద్రాలు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. ఇప్పటికీ ఆర్డర్లు ఇవ్వకపోతే ఎప్పుడు పోలింగ్‌ కేంద్రాల కి వెళతామని ఉద్యోగులు గొడవపెడుతున్నారు.

చాలీచాలని టిఫిన్లు…
ఇంకోవైపు ఉద్యోగులు ఉదయం 8 గంటల లోపు వచ్చిన వారికి ఇడ్లి, ఉప్మా, వడ తో టిఫిన్లు ఏర్పాటు చేశారు. 8.30 గంటలు దాటిన తర్వాత కేవలం ఉప్మా తో సరిపెట్టేశారు. దీంతో ఉద్యోగులు టిఫిన్‌ ఏర్పాట్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఇదేనా గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️