ఏబీఆర్‌ డిగ్రీ కాలేజ్‌ కు అటానమస్‌ హోదా

ప్రజాశక్తి – రేపల్లె (బాపట్ల) : రేపల్లె ఏబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి అటానమస్‌ హోదా లభించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సి రవిచంద్ర కుమార్‌ తెలిపారు. శనివారం కళాశాలకు లభించిన హోదాపై విలేకరులతో మాట్లాడారు. కళాశాలలో ఉన్న సౌకర్యాలు కేంద్ర బఅందం క్లుప్తంగా పరిశీలించి 2023లో న్యాక్‌లో ఏ గేడ్‌ హోదా కల్పించిందన్నారు. ప్రస్తుతం కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. 2024 నుంచి 2034 వరకు పదేళ్ల పాటు స్వయంప్రతిపత్తి హోదా కల్పించారన్నారు. కళాశాల భవనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాబోధన అందిస్తున్న తమ కళాశాలకు, అటానమస్‌ హోదాతో స్వయంగా ప్రశ్నాపత్రాలు, కొత్త పరిజ్ఞానంతో సబ్జెక్టుల్లో స్వయంగా మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కళాశాల ల్యాబ్‌లో అన్ని వసతులు ఉంటాయన్నారు. స్వయం ప్రతిపత్తితో అకడమిక్‌ సౌలభ్యం, స్థానిక అవసరాల దృష్ట్యా తామే 20 శాతం సిలబస్‌ మార్పునకు అవకాశం, ప్రత్యేక పరీక్షల విభాగాన్ని ఏర్పాటు చేసుకుని స్వయంగా పరీక్షల నిర్వహణ మెరుగైన ఫలితాలకు ఎంతో దోహదంగా ఉంటుందని తెలిపారు. కళాశాలకు ‘అటానమస్‌ హోదా’ రావడంపై కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

➡️