నిరంతర బదిలీలు పాలనకు ఆటంకం

Mar 2,2024 23:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు
తహశీల్దారు కార్యాలయానికి బదలీల ఫోబియా పట్టుకుంది. గత నెల రోజులుగా ప్రతి పది రోజులకు ఒక తహశీల్దారును మార్పులు చేస్తూ ఉండటంతో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన వారు సైతం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో? ఎప్పుడు బదిలీపై వెళ్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 2న తహశీల్దారుగా పనిచేసిన దూళిపూడి వెంకటేశ్వరరావు భట్టిప్రోలు నుండి బదిలీపై ఇంకొల్లుకు వెళ్లారు. ఆయన స్థానంలో 5న నెల్లూరు జిల్లా కనిగిరి చెందిన సుభద్ర తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పట్టుమని నాలుగు రోజులు కూడా పనిచేయకుండానే 9న బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన సిహెచ్ పద్మావతి ఫిబ్రవరి 11న తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె కూడా 20రోజులు పూర్తికాకముందే రేపల్లె ఆర్డీఒ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఇది ఇలా ఉండగా గత కొన్నేళ్లుగా భట్టిప్రోల్లో డిప్యూటీ తహశీల్దారు సీటు ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నాగరాజు బాపట్ల కలెక్టర్ సీసీగా డిప్యూటేషన్‌పై వెళ్ళటంతో ఇప్పటివరకు ఆ సీటు ఖాళీగా ఉండటంతో జిల్లా కార్యాలయం నుండి శ్రీనివాసరావును గత వారం రోజుల క్రితం డిప్యూటీ తాసిల్దారుగా నియమించారు. ఆయన కూడా మూడు రోజుల క్రితం బదిలీపై తిరిగి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ పనిచేస్తున్న మరొక శ్రీనివాసరావును డిప్యూటీ తహశీల్దారుగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు, చేర్పులతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాక సుమారు నాలుగేళ్లుగా రెండు ఆర్ఐ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇటీవల ఒక ఆర్ఐ పోస్టును భర్తీ చేయగా ఆమె కూడా డిప్యూటేషన్‌పై జిల్లా కార్యాలయానికి వెళ్లారు. దీంతో ప్రస్తుతం తహశీల్దారు కార్యాలయంలో రెండు ఆర్ఐ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పటివరకు సీనియర్లుగా ఉన్న వీఆర్వోలకు ఆర్ఐ బాధ్యతలు అప్పగించి ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం కూడా లేకపోవడంతో కార్యాలయంలో పనిచేసే మిగిలిన అధికారులకు పని భారం పెరిగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎప్పటికప్పుడు అధికారులను బదిలీలు చేస్తూ ఉంటే ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకుని సమర్థవంతంగా పనులు నిర్వహించటం అసాధ్యంగా మారుతుందని వాపోతున్నారు.
ఈవీఎం మిషన్ల బాధ్యత బట్టిప్రోలు అధికారులపైనే
వేమూరు నియోజకవర్గం స్థాయిలో ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవీఎం మిషన్ల బాధ్యత భట్టిప్రోలు అధికారులపైనే ఉండటంతో రెవెన్యూ అధికారులపై పని భారం మరింత పెరిగింది. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండవలసిన ఇవిఎం మెషిన్లు అక్కడ సరైన వసతులు లేవనే కారణంతో భట్టిప్రోలులోని విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల్లో ఏర్పాటు చేశారు. ఈ మిషన్ల పర్యవేక్షణ బాధ్యత ఎప్పటికప్పుడు స్థానిక తహశీల్దారుపైనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షించుకుని పూర్తిస్థాయిలో అవగాహన కలిగించుకునేలోగా అధికారులను బదిలీ చేస్తున్నడంతో మించిన భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీపై వచ్చిన తహశీల్దార్లు డిజిటల్ సంతకం కూడా యాక్టివేట్ కావడానికి వారం రోజులు పడుతుందని, అప్పటివరకు ఎలాంటి ముఖ్యమైన కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలు లేకుండా పోతుందని తెలిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అధికారులకు బదలీల ఫోబియా పట్టుకుందని అనటంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన మునిలక్ష్మి ఎన్ని రోజులు ఉంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది.

➡️