మున్సిపల్‌ కార్మికుల పోరాటానికి గొట్టిపాటి మద్దతు

Jan 7,2024 23:46

ప్రజాశక్తి – అద్దంకి
మున్సిపల్‌ కార్మికులకు ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంఘీభావం తెలిపారు. 2019ఎన్నికలకు ముందు అసెంబ్లీలో, జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా అందరిని మోసం చేశారని గొట్టిపాటి ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అధికారానికి వచ్చిన 6నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు నోచుకోక పోవడం మోసం చేయడం కాదాని ప్రశ్నించారు. పట్టణ విస్తీర్ణం, జనాభా పెరుగుదల దృష్యా కార్మికుల సంఖ్యను పెంచాలని, కరోనా సమయంలో తీసుకున్న అదనపు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, ఒపిఎస్‌ను అమలు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్భంధం ప్రయోగించాలనుకుంటే ఫలితం అనుభవిస్తారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ గంగయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

➡️