అంగనవాడీల రిలే నిరాహార దీక్ష

Dec 29,2023 23:21

ప్రజాశక్తి – రేపల్లె
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 18 రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా రిలే నిరాహారదీక్ష చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ దీక్షలను ప్రారబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతియుతంగా పోరాట చేస్తున్న తమపట్ల ప్రభుత్వం స్పందించకపోగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ అంగన్‌వాడీలను రెచ్చగొడుతుందని అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో పెరిగిన వేతనాలను ఈ ప్రభుత్వం పెంచినట్లు ప్రకటన చేస్తూ తప్పు దోవ పట్టిస్తుందని అన్నారు. కావున ప్రభుత్వ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 30న మంత్రుల ఇళ్ళు ముట్టడిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఒక పక్కన సానుకూలంగా ఉన్నామని చెబుతూ మరో పక్కన నేటికి తాళాలు పగలగొడుతున్నదని విమర్శించారు. సమ్మెను ఉదేసించు సిఐటియూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తుందని అన్నారు. తాము అధికారానికి వచ్చాకా వేతనాలు పెంచామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రమాద బీమా ఇస్తున్నామని ప్రకటన చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. చేతనైతే పిలిచి సమస్యలు పరిష్కరించాలి కాని ఈ పద్ధతుల్లో తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో ఎన్ కృష్ణకుమారి, వై మేరీమణి, డి జ్యోతి, నిర్మలజ్యోతి, లావణ్య, దీప్తి పాల్గొన్నారు.


పర్చూరు : స్థానిక సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నా 18వ రోజుకి చేరుకుంది. మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌరవ వేతనం వద్దని కనీస వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చర్చలకు పిలుస్తున్న ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్స్‌ నెరవేరేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని చెప్పారు. అంగన్‌వాడీల ధర్నాకు వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, బి చిన్నదాసు, ఎం డేవిడ్ పాల్గొన్నారు.


సంతమాగులూరు : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె, దీక్షలు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద 18వ రోజుకు నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. అంగన్‌వాడీల సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. అంగన్‌వాడీలకు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు ఇల్లూరి లక్ష్మీశేషు తమ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మస్తాన్ బి, శ్రీదేవి, ఎస్తేరా రాణి, శ్రీదేవి, మల్లేశ్వరి, ఆదెమ్మ, రమణ పాల్గొన్నారు.


కొల్లూరు : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం 18వ రోజు కొనసాగింది. తమ డిమాండ్స్‌ పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు దీక్షా శిబిరం నుండి పోలీస్ స్టేషన్, జగజ్జీవన్ రావ్ కమ్యూనిటీ హాల్ మీదగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొనిగల సుబ్బారావు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు బాల, కాశి, వనజ, నాగరాజుకుమారి, సౌభాగ్య లక్ష్మి, భాగ్యం పాల్గొన్నారు.


రేపల్లె : అంగన్‌వాడి కార్యకర్తల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంధ్ర మంత్రి జెడీ శీలం మద్దతు తెలిపారు. రిలే నిరాహార దీక్ష శిభిరం వద్దకు వచ్చి నిమ్మరసం ఇచ్చి శుక్రవారం దీక్షను విరమింపచేశారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడిలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అంజిబాబు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల ఇన్చార్జి రామకోటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, అంగన్‌వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ, ఎన్ కృష్ణకుమారి, వై మేరీమణి, జ్యోతి పాల్గొన్నారు.


నగరం : అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా శుక్రవారం రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. యూనియన్ నాయకులు కె రత్నకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇవ్వని పథకాలు కూడా ఇస్తున్నామని, గతం ప్రభుత్వంలో పెంచిన జీతాలను తామే పెంచినట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు ఖండించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాళ్లు రాజ్యలక్ష్మి, శివనాగులు, మంగాదేవి, నళిని, సునీత పాల్గొన్నారు.


అద్దంకి : అంగన్‌వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 18రోజుల నుండి సమ్మె కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజులైనా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఆట, పాటల ద్వారా నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి యూనియన్ నాయకులు జి శారద, మను, లత, చంద్రమతి, చైతన్య, వరలక్ష్మి పాల్గొన్నారు.


చెరుకుపల్లి : తమకు ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారానికి నిరసనగా 18వ రోజు అంగన్‌వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోక ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జీతాలు పెంచకుండానే గతంలో పెంచినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మల్లీశ్వరి, శిరీష, మంగాదేవి, సంతోష్ కుమారి, చైతన్య పాల్గొన్నారు.


ఇంకొల్లు రూరల్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. అక్క, చెల్లెమ్మల డిమాండ్స్ పరిష్కరించు అన్నయ్య అని రాష్ట్రమంతా రోదిస్తున్న విన్నవించుకొని జగనన్న ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు, నియోజకవర్గ ఇన్చార్జి లకు అర్జీలు ఇవ్వడానికి వెళితే కార్యకర్తలను అరెస్టు చేయడం, బెదిరింపులకు పూనుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశామని హెచ్చరించారు. గుర్రాలతో తొక్కించినా, నీటి ఫిరంగులతో తడిపిన మా సత్తా చూయించి డిమాండ్స్ సాధించుకున్న రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. 18వ రోజు జగనన్నకు చెబుదాం అంటూ పోస్టు కార్డులతో లేఖలు రాసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు, ప్రాజెక్టు లీడర్లు బిక్కి సరళ, భారతి, లక్ష్మి, అనూరాధ, తులసి, కుమారి, దేవమ్మ, రాజ్యలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.


చుండూరు : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపుకోవాలని మాజీమంత్రి నక్క ఆనందబాబు అన్నారు. చుండూరు, అమృతలూరు తహశీల్దారు కార్యాలయాల వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల నిరవధిక సమ్మె శిబిరం వద్దకు చేరుకొని అంగన్‌వాడీల దీక్షకు సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలకు టిడిపి ప్రభుత్వంలో రూ.4600 నుండి రూ.10,500పెంచినట్లు తెలిపారు. అప్పట్లో టిఏ బిల్లులు, అద్దె చెల్లింపులు చేశామని గుర్తు చేశారు. 2018లో జిఓ నంబర్ 18ద్వారా వేతనాలు పెంపుదల చేయగా 2019లో జిఓ నంబర్ 13ప్రకారం వైసిపీ రూ.1వెయ్యి వేతనం పెంచి అన్నీ చేసినట్లుగా చెప్పుకోవటం ఛిగ్గుచేటన అన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు టిడిపి అండగా ఉండుందని భరోసా నిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, సిఐటియు నాయకులు బి ఆగస్టిన్ పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడీల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 18వ రోజు పూర్తి చేసుకుంది.సమ్మె సందర్భంగా రిలే నిరాహార దీక్షలో శుక్రవారం వినూత్న రీతిలో చేతులు అడ్డుపెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల వేతనం పెంచడం, గ్రాట్యూటీ అమలు చేయడం, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించడం వంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.


కారంచేడు : సమస్యల పరిష్కారం కోసం గత 18రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మండలంలోని కుంకలమర్రు సచివాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి శుక్రవారం తమ నిరసన తెలిపారు. ఇకనైనా సిఎం తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొండయ్య, అంగన్‌వాడి ప్రాజెక్టు నాయకులు రాధా, మేరీ, మరియమ్మ పాల్గొన్నారు.

➡️