వ్యవసాయ కళాశాల్లో 2, 3న విద్యార్థి సదస్సు : దేశ వ్యాప్తంగా హాజరు కానున్న 700మంది విద్యార్థులు

Apr 2,2024 01:01 ##NGRANGA #Bapatla #College

ప్రజాశక్తి – బాపట్ల
జాతీయ స్థాయిలో వ్యవసాయ విద్యార్థి శాస్త్ర సాంకేతిక సదస్సు ఈ నెల 2, 3తేదీల్లో బాపట్ల వ్యవసాయ కళాశాల్లో జరుగుతుందని డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ ఎవి రమణ తెలిపారు. కళాశాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 7వందల మంది విద్యార్థులు హాజరౌతారని తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సులే జరుగుతూ వచ్చాయని, తాజాగా జాతీయ స్థాయిలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో విద్యార్థుల జాతీయ స్థాయి సదస్సు తొలిసారిగా తమ కళాశాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. భారత వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆలోచనలను ఆవిష్కృతం చేసే దిశగా ఈ సదస్సు ఒక ఆలోచనకు రూపం ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈపాటికే వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనాత్మక అంశాలపై జాతీయ స్థాయిలో జరిగిన అనేక సదస్సులు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. విద్యార్థి దశలోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటం ద్వారా వ్యవసాయ రంగంలో ఒక వినూత్నమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 700మంది విద్యార్థులు తమ పరిశోధన ఫలితాల పత్రాలను పంపినట్లు తెలిపారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు వివరించారు. వీటితోపాటు అమెరికా నుండి పరిశోధన పత్రం ఒకటి అందినట్లు వివరించారు. ఉత్తమ పరిశోధనలను ఈ సదస్సులో ఎంపిక చేస్తామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డిడి స్మిత్, వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ బి శ్రీనివాసరావు, సాయిరాం, ఆహార విజ్ఞానం కళాశాల అసోసియేట్ డీన్ పాల్గొన్నారు.

➡️