ఈనెల 20నుండి విఆర్‌ఎల సమ్మె

Feb 17,2024 23:58

ప్రజాశక్తి – నగరం
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20నుండి వీఆర్ఏల సమ్మెను తెలియజేస్తూ డిప్యూటీ తాహశీల్దారు ఎం.శ్రీనివాసరావుకు విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సిఐటియూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతు రెవెన్యూ సహాయకులకు పే స్కేల్, 2018 నుండి రికవరీ చేసిన డిఎ బకాయిలను తిరిగి చెల్లించాలని కోరారు. నామినీలను వీఆర్పీలుగా గుర్తించాలని కోరారు. అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని అన్నారు. ఈనెల 20లోపు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతామని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్రామాల్లో వారధులుగా పనిచేస్తూ, శిస్తు వసూలు ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న విఆర్‌ఎలు గత ఆరేళ్లుగా జీతాలు పెరగక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని అన్నారు. వీఆర్ఎలకు దశాబ్దాల తరబడి అమలైన డిపిఏను నిలిపివేయటమే కాక గతంలో చెల్లించిన డిఎను రికవరీ చేసి మరింతగా వీఆర్ఎల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే స్పందించి వీఆర్ఎల కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడాలని కోరారు. తమతో కలిసి పనిచేసిన తెలంగాణా విఆర్ఎలకు అక్కడి ప్రభుత్వం పేస్కేల్ అమలు చేస్తున్నదని అన్నారు. మన రాష్ట్రంలో కూడా పేస్కేల్ అమలు చేయాలని కోరారు. సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు విజయవాడ ధర్నాచౌక్లో జరిగిన విఆర్ఎల ధర్నా శిభిరంకు హాజరై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విఆర్ఎల జీతం రూ.15వేలకు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు. గత 6నెలల క్రితం రూ.500లు డిఎ అమలు చేస్తామన్న హామీ మేరకు జిఓ ఎంఎస్ నెం.40 ఇచ్చారని, కాని 2018 నుండి రూ.300ల డిఎని విఆర్ఎల జీతాల నుండి సుమారు రూ.15వేలు ప్రభుత్వం రికవరీ చేసిందని అన్నారు. రికవరీ చేసిన నిధిని తిరిగి విఆర్ఎలకు చెల్లిస్తామన్న హామీని నెరవేర్చలేదని అన్నారు. అర్హులైన విఆర్‌ఎలకు ప్రమోషన్స్ అమలు చెయ్యడం లేదని అన్నారు. విఆర్‌ఎ సంఘం మండలం అధ్యక్షులు జి పిటర్ మాట్లాడుతు నామీనలను విఆర్ఎలుగా గుర్తిస్తామన్న హామి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యు దయరత్నం, నాయకులు ఎం అంనద్ పాల్గొన్నారు.

➡️