మంచం పట్టిన రాసకీల

మంచం పట్టిన రాసకీల

విషజ్వరాలతో గిరిజనం విలవిల

పది రోజులైనా రోగులకు అందని వైద్యం

కలుషిత నీరు తాగడం వల్లే ఈ దుస్థితి

పాడైన బోరు బాగుచేయడంలో నిర్లక్ష్యం

ప్రజాశక్తి -అనంతగిరి : మండలంలోని పిన్నకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాసకీల గ్రామంలో విషజ్వరాలతో గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. పది రోజులైనా కనీస వైద్య సేవలు అందక జ్వరపీడితులు మంచం పట్టారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కనీసం వైద్యసిబ్బంది అయినా వచ్చి తమను పట్టించుకోవడం లేదని, జ్వరంతో కాలినడకన వైద్యానికి వెళ్లలేక మగ్గిపోతున్నామని వాపోతున్నారు. మండలంలోని రాసకీల గ్రామంలో సూకూరు జ్యోతమ్మ, సూపరు, సోమయ్య, సూకురు లక్ష్మయ్య ఇలా పలువురు రోగులు పది రోజులుగా విషజ్వరాలతో బాధపడుతున్నారు.సమస్యను సంబంధిత వైద్యసిబ్బంది దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఎవరూ స్పందించకపోవడంతో పదిరోజులుగా నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. అందరూ ఎన్నికల హడావిడిలో ఉండడంతో తమ గోడును వినిపించుకునే వారే లేకుండా పోయారని అంటున్నారు. వైద్యసేవలకు వెళ్లాలంటే, జ్వరంతో నీరసించి అస్వస్థులైన తాము కొండ కోనలను దాటుకుని కాలినడకన వెళ్లే పరిస్థితి లేదని, డోలీపై మోసుకెళ్లి తీసుకెళ్లే వారు లేరనిదీంతో మంచంలోనే మగ్గిపోతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, రాసకీలలో జ్వరపీడితులకు తక్షణవైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. కలుషిత నీరు వల్లే జ్వరాలుగత్యంతరం లేని పరిస్థితుల్లో గెడ్డల్లోని కలుషిత నీటిని వినియోగించడం వల్లే గిరిజనులు విషజ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు అంటున్నారు. గ్రామంలో మంచినీరు అందించేందుకు నీటి పథకం ఉన్నప్పటికీ,దాని మోటారు పాడవ్వడంతో మరమ్మతులు చేసే దిక్కు లేకపోవడంతో గ్రామానికి దరిలో ఉన్న ఊటగెడ్డలోని నీటిని వాడుతున్నామని గిరిజనులు అంటున్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో గెడ్డలోని నీరు ఇంకిపోవడం, కలుషితమైన ఆ నీటినే వాడాల్సిన దుస్థితిలో ఇలా విషజ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే పాడైన నీటి పథకం మోటారుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

 

వైద్యం అందక పది రోజులుగా మంచం పట్టిన లక్ష్మయ్య

➡️