రాంకీపై చర్యలు తీసుకోవాలి – గ్రామస్తుల ఆందోళన

ప్రజాశక్తి – పరవాడ (అనకాపల్లి జిల్లా) :రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, భరిణికం మాజీ సర్పంచ్‌ బండా తాతారావు, జనసేన నాయకులు పెద్దిశెట్టి సత్యారావు మాట్లాడుతూ భరిణికం గ్రామాన్ని ఆనుకొని ఉన్న మల్లోడు గెడ్డలోకి ఫార్మా వ్యర్థ రసాయనాలను వదలడం వల్ల వల్ల తీవ్ర దుర్వాసన వస్తోందన్నారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వ్యవసాయానికి నష్టం వాటిల్లుతోందని, పశువులు చనిపోతున్నాయని తెలిపారు. రాంకీ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి ఆరుబయట గెడ్డలు, కాలవలు, చెరువుల్లోకి ఫార్మా వ్యర్థ జలాలను ఇష్టానుసారంగా వదులుతోందని తెలిపారు. ఫిర్యాదులు అందుతున్నా కాలుష్య నియంత్రణ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాంకీ తీరుతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఇప్పటికే రాంకీ తీరుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో సిపిఎం కేసు వేసిందని తెలిపారు. కార్యక్రమంలో భరణికం గ్రామస్తులు బండా వెంకట సత్యారావు, గనిశెట్టి అప్పలరాజు, బి శివకుమార్‌ పాల్గొన్నారు.

➡️