ప్రచారం..పరిసమాప్తం

May 11,2024 21:45

 నేటి సాయంత్రం వరకు ఇంటింటి ప్రచారానికి అనుమతి

జిల్లాలో 144సెక్షన్‌ అమలు

విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ

నిద్రావస్థలో నిఘా వ్యవస్థ

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో చివరి రోజు అభ్యర్థులంతా ప్రచారాన్ని హోరెత్తించారు. ఎక్కడికక్కడ బైక్‌ ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేపట్టారు. సాయంత్రం 6గంటల తరువాత ప్రచార బాకాలన్నీ మూగబోయాయి. ఆదివారం సాయంత్రం వరకు ఇంటింటి ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అభ్యర్థులు యాడ్‌లు ఇచ్చుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ప్రచారం గడువు ముగియడంతో జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల 144సెక్షన్‌ విధించింది. దీని ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మందితో ప్రచారానికి వెళ్లకూడదని కూడా షరతు విధించింది. ఇతర జిల్లాలకు చెందిన వారెవరూ నియోకవర్గాల్లో ఉండేందుకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బహిరంగ ప్రచార ముగియడం, పోలింగ్‌ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుండడంతో ఓటర్లను లోబరుచుకునేందుకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. డబ్బు, మద్యం పంపకాలు విచ్చలవిడిగా చేస్తున్నాయి. వందల కోట్ల రూపాయల డబ్బు, లారీల కొద్దీ మద్యం జిల్లాకు చేరింది. మందుబాబులు పూటుగా తాగి చిందులేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు డబ్బు, మద్యం పంపిణీలో తలమునకలయ్యారు. పోటాపోటీగా పంపకాలు చేస్తున్నప్పటికీ, కేసులు నమోదు చేయాల్సిన నిఘా వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. అధికారులు సిబ్బంది మాటలకే పరిమితమయ్యారు. ఒక పార్టీ నేరుగా మండల, గ్రామ స్థాయి నాయకుల ద్వారా డబ్బు పంపిణీ చేస్తుండగా, మరో పార్టీ వివిధ జిల్లాలకు చెందిన 70నుంచి 100మంది వరకు నియోజకవర్గాలకు రప్పించి, వారి ద్వారా పంపకాలు చేపడుతోంది. దీంతో, స్థానిక నాయకులుగా తమను గుర్తించలేదంటూ ఆ పార్టీకి చెందిన గ్రామ స్థాయిట నాయకులు లోలోపల మదన పడుతున్నారు. ఇరు పార్టీలు ఓటుకు రూ.1000 నుంచి రూ.3000 వరకు ఎరజూపుతున్నారు. అయితే పార్టీ అభ్యర్థులు కొంతమొత్తం పంచాలని చెబితే మండల స్థాయి నాయకులు అందులో కొంత నొక్కేసి తక్కువ పంచుతున్నారంటూ దిగువస్థాయి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి తక్కువ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసేందుకు ఇవ్వడంతో మండల స్థాయి నాయకులంతా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో గత్యంతరం లేక వారికి నచ్చిజెప్పి మరుచటి రోజు ఓటుకు రూ.1500 చొప్పున పంపిణీ చేసేందుకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులున్నా మద్యం, డబ్బు ప్రవాహం రకరకాల దారుల్లో తరలిపోతోంది. ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయకపోవడంతో వాటిలోనూ కొంతమొత్తం రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. ఆశ, దురాశ కొద్దీ డబ్బులు, మద్యం పంపకాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభావం ఓటింగ్‌పై పడే పరిస్థితి లేదని, ఒకప్పటితో పోలిస్తే ఓటర్లు చైతన్యవంతులేనని చాలా మందినోట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలసకుటుంబాలు కూడా గ్రామాలకు చేరుకుంటున్నాయి. వారు స్వగ్రామాలకు వచ్చేందుకు అవసరమైన రవాణా ఛార్జీలను ఇప్పటికే ఆయా పార్టీలు ఫోన్‌పే ద్వారా పంపించాయి. ఓటు వేసేందుకు కూడా డబ్బులు ముట్టజెప్పారు. పోలింగ్‌కు ముందు రోజు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవుదినం కావడంతో చాలా మంది ముందు రోజు రాత్రికే గ్రామాలకు చేరుకునే విధంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్‌ రోజు కూడా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలకు సెలవు దినంగా ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు శెలవు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ప్రకటించారు. ఈనేపథ్యంలో పోలింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు, ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

➡️