చందనోత్సవం.. విజయవంతం

చందనోత్సవం..

భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో తగ్గిన ‘పొలిటికల్‌’ రద్దీ

ప్రజాశక్తి – సింహాచలం : సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవమైన చందనోత్సవం విజయవంతమైంది. దేవస్థానం అధికారులు ఉత్సవాన్ని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతో అప్పన్న స్వామిని మేల్కొలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామిపై ఉన్న చందనాన్ని తొలిచి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామి వారి తొలి దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతి రాజు దంపతులకు కల్పించారు. ఈ ఏడాది చందనోత్సవంలో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. శుక్రవారం వాతావరణం చల్లబడడంతో భక్తులు భారీగానే తరలివచ్చారు. ఆహ్లాదకర వాతావరణం నడుమ నృసింహస్వామిని దర్శించుకున్నారు. సుదీర్ఘ క్యూలైన్లు ఉండటంతో కొందరు భక్తులు ఇబ్బంది పడటం కనిపించింది. భక్తులకు క్యూ లైన్లలో మంచినీటి సదుపాయం కల్పించారు. మజ్జిగ, శీతల పానీయాలను స్వచ్ఛంద సేవా సంస్థల వారు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టికెట్‌ లేకుండా ఏ ఒక్కరినీ దర్శనానికి అనుమతించకపోవడంతో ప్రతి భక్తునికీ సామి దర్శనం సాఫీగా సాగింది. సాయంత్రం భక్తుల రద్దీ దృష్ట్యా రూ.300, రూ.1000, రూ.1500 క్యూలైన్లలో భక్తులను పంపించి రద్దీని నియంత్రించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా గట్టి పోలీస్‌ భద్రత కల్పించారు. వాహనాలను కొండపైకి అనుమతించలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రాజకీయ నాయకులకు, అధికారులకు ప్రొటోకాల్‌ వర్తించలేదు. స్వామివారిని శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, ఆయన శిష్యులు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, దేవాదాయ శాఖ చీఫ్‌ సెక్రటరీ, కమిషనర్‌ ఎస్‌డిసి రామచంద్ర మోహన్‌, పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యర్‌, జివిఎంసి కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, వివిధ విభాగాల అధికారులు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకున్నారు.

➡️