అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు

Dec 27,2023 22:13

6లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రెడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులలో అర్హులందరికీ ఇంటిపట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇంటిపట్టాల మంజూరుకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా సచివాలయం నుండి డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, చిత్తూరు ఆర్డిఓ చిన్నయ్య, జిల్లా లాండ్స్‌ అండ్‌ సర్వే సహాయ సంచాలకులు గౌస్‌ భాష, డిఐపిఆర్‌ఓ బి.పద్మజ, చిత్తూరు, గుడిపాల తహసీల్దార్లు మురళీమోహన్‌, రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ 2023 సంవత్సరంలో అక్రిడిటేషన్‌ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాల మంజూరుకు ప్రభుత్వం జీవో నంబర్‌ 535ను జారీ చేసిందని, చిత్తూరు జిల్లాకు ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటి వరకు 195 దరఖాస్తులు అందాయని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటిపట్టాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడిటేషన్‌ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను, కనీసం 5 సంవత్సరాలు జర్నలిస్టుగా వారి వత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ వారి కార్యాలయ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధవీకరించి ఇప్పటివరకు 195మంది జర్నలిస్టుల జాబితా జిల్లాకు అందిందన్నారు. తదుపరి వెరిఫికేషన్‌ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్‌పర్సన్‌, జిల్లా కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, ముగ్గురు జర్నలిస్టులు సభ్యులుగా, డిఐపిఆర్‌ఓ కన్వీనర్‌ జిల్లాస్థాయి హౌసింగ్‌ కమిటీ ఏర్పాటు అయ్యిందని తెలిపారు. ఈ కమిటీ జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. 2024 జనవరి 6వ తేదీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గడువు ముగుస్తున్నందున జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరూ ఇళ్లస్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. కమిటీ సమావేశం అనంతరం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ సెక్రెటరీ అశోక్‌ కుమార్‌, సభ్యులు, పాత్రికేయులు ఇంటిపట్టాల మంజూరుకు సంబంధించిన అంశాలను కమిటీ దష్టికి తీసుకువచ్చారు.

➡️