జీతాలు పెంచు జగన్‌ గోవిందా..

Dec 23,2023 22:28
జీతాలు పెంచు జగన్‌ గోవిందా..

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ గోవిందా…. గోవిందా.. జీతాలు పెంచు జగన్‌ గోవిందా.. అంటూ వైకుంఠ ఏకదశిని పురస్కరించుకొని అంగన్వాడీలు చిత్తూరు సిడిపివో కార్యాలయం ఎదుట తమ జీతాలు పెంచాలని కోరుతూ పొల్లుదండాలు పెట్టారు. 12రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలు వైకుంఠ ఏకాదశి రోజున సమ్మెలోనే ప్రత్యేకపూజలు నిర్వహించి జగన్‌కు మంచి బుద్దిప్రసాదించి జీతాలు పెంచేలా చేయి దేవుడా అంటూ పొల్లుదండాలు పెట్టారు. అంగన్వాడీల పోరాటానికి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సృజని, బుజ్జి ప్రేమ, ప్రభావతిలు మాట్లాడుతూ అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వకపోవడం వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శిశుసంక్షేమశాఖ లబ్దిదార్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండిగా వ్యవహరిస్తే సమ్మెను ఉధృతం చేస్తామని 25వ తేదీ లోపుగా తమ ప్రధాన సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి, ఛలో విజయవాడ నిర్వహించన్నట్లు తెలిపారు. కడప జిల్లాలో పోలీసుల ద్వారా అంగన్వాడీల నిర్భందించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అర్బన్‌, రూరల్‌, గుడిపాల మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. కార్వేటినగరం : రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్వేటినగరం ప్రాజెక్టులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు కూడా పస్తువులతో గోవింద నామస్పరణలతో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. పండగల సందర్భంలో కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. సంబంధిత శాఖ మంత్రి తప్పుడు సమాచారంతో అంగన్వాడీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఇలాంటి మోసాలను అంగన్వాడీలు గట్టిగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. అంగన్వాడీలు ఒకరోజు టిహెచ్‌ఆర్‌ ఇవ్వకపోతే మెమో మీద మెమోలు ఇచ్చే అధికారులు ఇప్పుడు 12 రోజులుగా లబ్ధిదారులకు వస్తువులు ఇవ్వని సచివాలయ ఉద్యోగులను ఏమి చేస్తారని ప్రశ్నించారు. అంగన్వాడీలకు ఒక న్యాయం వారికి ఒక న్యాయమా అని అన్నారు. రేపు ఆదివారం రోజు కూడా అన్నిచోట్ల సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని క్రిస్మస్‌ రోజు కూడా రిలే దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు మమత, రాధ, అంగన్వాడీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వికోట: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో శనివారం సిఐటియు మండల కార్యదర్శి అనిత ఆధ్వర్యంలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం సత్వరం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్ట్‌ కార్యదర్శి శ్యామల, అధ్యక్షులు జీవిత, సిఐటియు మండల కార్యదర్శి జ్యోతి, సుజాత పాల్గొన్నారు. పలమనేరు: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియూల ఆధ్వర్యంలో శనివారం అంగన్వాడీలు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు గిరిధర్‌ గుప్త మాట్లాడుతూ ఇప్పటికే 12 రోజులుగా ఎన్ని రకాల అవరోధాలు సష్టించిన సమ్మె ముందుకి వెళుతున్నదే తప్ప వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. బైరెడ్డిపల్లి: అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం భిక్షాటన చేస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా గ్రామప్రధాన వీధుల్లో బైరెడ్డిపల్లి, పలమనేరు, వికోట మండలాలకు చెందిన అంగన్వాడీలు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, డిమాండ్లతో నినాదాలు చేస్తూ భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. యాదమరి: అంగన్వాడీ వర్కర్స్‌ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో శనివారం అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు షకీలా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమని దీనికి తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. మండలంలో చేస్తున్న అంగన్వాడి వర్కర్స్‌ సమ్మెకు మద్దతుగా యుటిఎఫ్‌ నాయకులు, వీఆర్‌ఏలు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు మమత, ప్రమీల, అంబికా అంగన్వాడి వర్కర్స్‌ పాల్గొన్నారు.

➡️