పంటనష్టాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు

Dec 7,2023 22:12
పంటనష్టాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి వార్తకు స్పందన తుపానుకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలుప్రజాశక్తి- సోమల: మిచౌంగ్‌ తుపాను వల్ల అధిక వర్షాలు కురిసి పంట నష్టం జరిగిన రైతులు శాస్త్రవేత్తల సూచనలను పాటించి, జరిగిన నష్టాన్ని తగ్గించుకోవాలని ఏరువాక కేంద్రం చిత్తూరు శాస్త్రవేత్త, సమన్వయకర్త రెడ్డిరాము రైతులను కోరారు. గురువారం మండలంలో తుపాను వల్ల నష్టపోయిన రైతుల వ్యవసాయ పొలాలను మండల వ్యవసాయ సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టాన్ని అంచనా వేశారు. రైతులతో మాట్లాడి వారికి పలు సూచనలను అందజేశారు. సోమల దిడ్డివారిపల్లి, ఆవులపల్లి, నంజంపేట గ్రామాల పరిధిలో వరి పైరుకు జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి నివేదికలను సిద్ధం చేసి రైతులకు పలు సూచనలను అందజేశారు. నీటిలో మునిగిన వరి పొలాల్లో నీటిని కాలువలు తీసి బయటకు పంపించాలని, గింజ గట్టిపడే దశ, కోత దశలో ఉన్న వరి పొలాలు, నేలమీద ఒరిగిన వరిపంట పొలాలలో నీరు తీసి వేసుకుని, గింజలు మొలకలు రాకుండా ఉండడానికి 5శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని తెలిపారు. పిచికారీ చేసుకోవడానికి వీలు కాకపోతే ఎకరాకు 25కేజీల రాళ్ల ఉప్పును పొలంపై వెదజల్లుకోవడం వలన గింజలు మొలక వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చునని, కళ్ళాల మీద ఉన్న ధాన్యం రంగుమారే అవకాశం ఉంటుంది, కాబట్టి నష్టాన్ని నివారించుకునేందుకు ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పును కలుపుకోవడం వలన గింజ మొలకెత్తకుండా నివారించుకోవచ్చునని, ఎండ వచ్చిన వెంటనే ఎండబెట్టి తూర్పార పట్టుకోవలెనని సూచించారు. ఏవో సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతి రైతు శాస్త్రవేత్తలు సూచించిన జాగ్రత్తలు పాటించి, తుపాన్‌ వల్ల దెబ్బతిన్న వరి పంటలో నష్టాన్ని తగ్గించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్తలు, మోహన్‌ రెడ్డి, విశ్వనాథ్‌, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మునిజ్యోతి, వనజ, రాధిక, సుబ్రమణ్యం, రైతులు పాల్గొన్నారు.

➡️