పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ

Jan 21,2024 22:49
పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రజాశక్తి- పుంగనూరు: పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలని ఏపీ గవర్నర్‌ కు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను కలిసి పుంగనూరులో జరుగుతున్న అరాచకాలపై ఆదివారం ఫిర్యాదు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భాతర చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలను పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారనే విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు బిసివై కార్యకర్తలపై చేసిన దాడికి సంబంధించిన చిత్రాలు, సిఐ చెప్పుతో కొట్టిన చిత్రాలను ఫిర్యాదుతో పాటు గవర్నర్‌కు అందించారు. సంప్రదాయంగా జరుపుకునే పండుగలకు కూడా అనుమతుల పేరుతో పోలీసులు వేధిస్తున్న విషయాన్ని ఆయన గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు. బోడె రామచంద్రయాదవ్‌ ఫిర్యాదును స్వీకరించిన గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. సాక్ష్యాధారాలను పరిశీలించి విచారణ జరిపిస్తామని తెలిపారు. అనంతరం బోడె రామచంద్రయాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల క్రితం పుంగనూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో రైతుల సమస్యల పై నియోజకవర్గంలో ఉన్న సమస్యల పై బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టామని, ఒక ప్రైవేట్‌ స్థలంలో స్థల యజమాని అనుమతి తీసుకొని, అన్ని సౌకర్యాలతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నామని, కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం పోలీస్‌ శాఖలో ఉన్న కొంతమంది అధికారులు అక్రమంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతోపాటు పూర్తిగా అక్కడ భయానక వాతావరణం సృష్టించారన్నారు. అక్కడున్న తమ కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయడంతో పాటు కార్యకర్తలపై లాఠీచార్జి చేసి లాఠీలతో బెదిరించారని, చెప్పుల తో దాడి చేశారు. పుంగనూరు నియోజ కవర్గంలోనే కొంతమంది పోలీస్‌ అధికారు లు మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మెప్పు కోసం ఇలా చేయడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం నడుస్తోందా?’ అంబేద్కర్‌ రాజ్యాంగం ఉందా? అనే విషయాన్ని అందరూ చర్చించు కుంటున్నారన్నారు. చిత్తూరు ఎస్పి రిషాంత్‌ రెడ్డి రాగానే తమకు మంచి జరుగుతుందని జిల్లా వాసులు భావించారని, అయితే శాంతి భద్రతలు అధ్వానంగా మారా యన్నారు. ఆయన ఒక వైసీపీ కార్యకర్తలా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిలా వ్యవహరించడం అన్యాయమన్నారు. ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు పెడుతూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పుంగనూరులో జరుగుతున్న పెద్దిరెడ్డి అరాచకాలతో పాటు పోలీసుల తీరుపై సాక్ష్యాధారాలతో సహా గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని తెలిపారు. విచారించి చర్యలు తీసుకుంటామని గవర్నరు సానుకూలంగా స్పందించారన్నారు.

➡️