ప్రతి పనీ ప్రజాహితం కొరకే : సెల్వమణి

Jan 30,2024 22:22
ప్రతి పనీ ప్రజాహితం కొరకే : సెల్వమణి

ప్రజాశక్తి-నగరి: నియోజకవర్గంలో చేపట్టే ప్రతి పనీ ప్రజాహితంగానే మంత్రి ఆర్కేరోజా చేపడుతున్నారని ఆమె భర్త రాయలసీమ వీవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి అన్నారు. మంగళవారం కుశస్థలీ నదిపై ఉన్న లోతట్టు వంతెన వరదనీటికి చిద్రం కావడంతో తాత్కాలికంగా మట్టిరోడ్డును ఏర్పాటు చేసిన ప్రాంతంలో పక్కాగా తారురోడ్డు నిర్మించే పనులను, మున్సిపల్‌ బస్టాండును నవీకరించే పనులను, సంతమైదానంలో నిర్మిస్తున్న మున్సిపల్‌ కాంప్లెక్స్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి ఆర్కేరోజా ప్రతి పనిని పక్కాగా, ప్రణాళికాత్మకంగా చేస్తున్నారన్నారు. ప్రజాహితంగానే ప్రతి పనీ కొనసాగుతోందన్నారు. కీళపట్టు మార్గంలో ఇదివరలో యుద్దప్రాతిపదికన తాత్కాలిక రోడ్డును ఏర్పాటుచేయడం జరిగిందని నేడు పక్కాగా తారు రోడ్డు వేస్తున్నామన్నారు. అలాగే నగరి ప్రజల ఎన్నో రోజుల కల అయిన మున్సిపల్‌ కాంప్లెక్స్‌ను దఢంగా నిర్మిస్తున్నామన్నారు. మున్సిపల్‌ బస్టాండుకు మరమ్మత్తులు చేసి రంగులు వేసి నవీకరించనున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీడీ భాస్కర్‌, గోపాల్‌రెడ్డి, ఇంద్రయ్య, యాకోబు, మురుగ, బిలాల్‌, అమర్‌, కోఆప్షన్‌ సభ్యులు ఎల్లప్పరెడ్డి, హమీద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️