ప్రశ్నార్థకంగా పనులు

Dec 5,2023 22:05
ప్రశ్నార్థకంగా పనులు

నాణ్యత నామమాత్రం నాసిరకంగా అంతర్‌ రాష్ట్ర రహదారి పనులు రూ.45 లక్షలు మట్టిపాలు?ప్రజాశక్తి- చిత్తూరుఈ ఫోటోలు కనిపిస్తున్న దశ్యం యాదమరి మండలం మార్లబండ క్రాస్‌ చిత్తూరు- గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారి. ఈ రహదారికి రెండు నెలల క్రితం తారు రోడ్డు వేసి మరమ్మతులు చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు నెలలకి ప్రస్తుతం రోడ్డు ఇప్పుడు ఇలా భారీ గోతుల మయమైంది.చిత్తూరు- గుడియాత్తం రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం రూ.45లక్షల మంజూరు చేసి మరమ్మతులు చేపట్టింది. మరమ్మతులు చేపట్టిన రెండు నెలలకి ప్రస్తుతం అంతర్రాష్ట్ర రహదారి గతంలో ఉన్న దారికంటే అధ్వానంగా తయారై, అసలు ప్రయాణించడానికికే వీలులేనంత దారుణస్థితికి చేరింది. దీంతో రోడ్డు వేయడానికి మంజూరైన రూ.45 లక్షలు మట్టి పాలయ్యింది. ప్రజలపై ప్రభుత్వం వేసే ప్రతి పన్నును ప్రజలు కష్టపడి కడుతుంటే ఆ ప్రజాధనంతో పదికాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాల్సిన అధికారులు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ నాసిరకం పనులు చేస్తున్న తమకేమన్నట్టు మిన్నుకుండిపోతున్నారు. ఇటు అధికారులకు అటు ప్రజాప్రతినిధులకు పనులు పది కాలాలపాటు ఉండేలా చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా పోయింది. అధికారులు కాంట్రాక్టర్లు లెక్కలేసుకొని మరి నాసిరకం పనులు చేసి జేబులు నింపుకోవడమే నిత్యకత్యమైంది. ఏగ్రామీణ రహదారిని చూసిన ఈ సత్యం బోధపడుతుంది. ఇది ఎక్కడో కాదు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న యాదమరి మండలంలో చిత్తూరు గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిని చూస్తే అర్థమవుతుంది. రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం రూ.45లక్షల వ్యయంతో టెండర్లు పిలిచింది. యాదమరి మండలం జోడి చింతల పోలీస్‌స్టేషన్‌ నుండి కనికాపురం చెక్‌పోస్ట్‌ వరకు రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న గుత్తేదారు పనులు చేపట్టారు. పది కిలోమీటర్లు చేయాల్సిన కాంట్రాక్టర్‌ జోడి చింతల నుండి కాశిరాల వరకు మూడు కిలోమీటర్లు మాత్రమే తారురోడ్డు గుంతలకు ప్యాచ్‌ వర్క్లు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రోడ్డు వేసి రెండు నెలలు కాకమునుపే తారు రోడ్డు ప్యాచ్‌ వర్క్‌లు పూర్తిగా లేచిపోయి గుంతలమయమ్యాయి. కాశిరాల నుండి కనికాపురం బార్డర్‌ వరకు గ్రావెల్‌ మిక్సర్‌తో రోడ్లల్లో గుంతలను పూడ్చి చేతులు దులుపుకున్నారు. ఈ వేసిన మూడు కిలోమీటర్ల తారు ప్యాచ్‌వర్క్లు పూర్తిగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిని గుంతలమయమైంది. రోడ్డు వేసే క్రమంలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించకపోవడంతోనే వేసిన రెండు నెలలకే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. రోడ్ల పనులను పర్యవేక్షించాల్సిన ఆర్‌ అండ్‌ బి అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై కమిషన్లు తీసుకొని నాణ్యతకు తిలోదకాలు వదిలేసారని, గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆర్‌ అండ్‌ బి ఏఈపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పది కిలోమీటర్ల పొడవున ప్యాచ్‌వర్క్‌ వేయాల్సిన అధికారులు మూడు కిలోమీటర్ల వరకే వేసి ఎందుకు ఆపేసారని నిలదీశారు. ఆర్‌అండ్‌ బి ఏఈ స్పందిస్తూ నిధులు ఉన్న వరకు మాత్రమే రోడ్డు వేశామని సమాధానం ఇచ్చారు. పది కిలోమీటర్ల రోడ్డు పొడవునా భారీ గుంతలు ఉండడంతో వాహనదారులు ప్రతిరోజు ప్రమాదాలభారిన పడుతున్నారు. తమిళనాడుకు వెళ్లే వాహనాలు గోతుల్లో ఇరుక్కొని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈరోడ్లగుండా రాత్రుల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన రోడ్డు వేసి రెండు నెలలు తిరక్కముందే రోడ్డులో భారీ గోతులుగా తయారై రూ.45లక్షల ప్రజాధనం మట్టిపాలయ్యింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతు పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, మండల ప్రజలు కోరుతున్నారు.

➡️