బెంబేలెత్తిస్తున్న గజరాజులు

Jan 18,2024 21:46
బెంబేలెత్తిస్తున్న గజరాజులు

శ్రీ ఏనుగుల దాడుల్లో ప్రాణ, పంటనష్టం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలోని అటవీసమీప ప్రాంతాల ప్రజలను గజరాజులు గజ గజ వణికిస్తున్నాయి. తరచూ ఏనుగులు జిల్లాలోని పలమనేరు, వికోట, బైరెడ్డిపల్లి మండలాలతో పాటు ఇటీవల గుడిపాల, బంగారుపాళ్యం మండలాలపై కూడా దాడులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఏనుగులు దాడులు చేసి ప్రాణ, పంట నష్టం చోటుచేసుకున్న సందర్భల్లో హాడావిడి చేసే ఫారెస్టు అధికారులు ప్రజాప్రతినిధులు ఆ తరువాత పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. సరిగ్గా ఆరునెలల క్రితం గుడిపాల మండలం 190 రామాపురం వద్ద గుంపు నుండీ తప్పిపోయిన ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. వ్యవసాయం చేసుకుంటున్న వెంకటేష్‌, సెల్వి అనే భార్యభర్తల ప్రాణాలను బలికొంది. మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచింది. రెండు రోజుల పాటు ఫారెస్టు అధికారులు శ్రమించి ఆ ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకొని గుంపులో కలిపేంత వరకు గుడిపాల, బంగారుపాళ్యం మండల ప్రజలు చిన్నపాటి అలికిడి విన్నా ఏనుగు వచ్చిందేమోనని బెంబెలెత్తిపోయారు. రెండు నెలల క్రితం బంగాపాళ్యం మండలం కీరమంద మండలపరిషత్‌ పాఠశాలపై దాడి చేసిన ఏనుగులు నిత్యవసర వస్తువులను నాశనం చేశాయి. తరుచూ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఏనుగులు దాడులు చేస్తున్నా అటవీశాఖ అధికారులు జనవాసాల్లోకి ఏనుగులు రాకుండా అరికట్టడంలో విషలం అవుతున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వర్షాభావ పరిస్థితుల్లో నీటికోసం వన్యమృగాలు అటవీ సమీపాల్లోని గ్రామాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో వన్యమృగాల తాగునీటి కోసం కందకాలు ఏర్పాటు చేయాలి. జనవాసాల్లోకి రాకుండా సోలార్‌ కంచను నిర్మించాలి. మన జిల్లాలోని పడమటి మండలాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లోని అడవుల సమీప గ్రామాల్లో ఏనుగులు పంటపొలాలపై పడుతున్నాయి. ఏనుగుల కదలికలను గుర్తించిన వెంటనే అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇవ్వాలని అటవీశాఖ సూచిస్తున్నా రాత్రి సమయాల్లో ఏనుగులు దాడులు చేయడం, పొలాల్లోని రైతులు అటవీశాఖ అధికార్లకు ఏనుగుల సంచారంపై సమాచారం ఇవ్వడం ఆలస్యం అవుతోంది. సోలార్‌ ఫెన్సింగ్‌ ఎప్పటికి పూర్తి అయ్యేనో.. ఏనుగుల దాడి నుండీ పంటలను కాపాడేలా అటవీప్రాంత సరిహద్దుల్లో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు అటవీశాఖ మ్యాప్‌ రూపొందించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అటవీశాఖ అధికారులు అటవీ సమీపభూముల్లో పంటసాగు మానుకొని పశుపోషణ జరపాలనే ఆదేశాలతో పాడి ఆవులను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నా పశువులను కూడా గజరాజులు వదలడం లేదు. పంట పొలలాను నాశనం చేస్తున్నాయి. పంట పొలాలను ఏనుగుల నుండీ కాపాడెలా సోలర్‌ కంచె ఏర్పాటు కళగానే మిగిలిపోయిందనే చెప్పాలి.ప్రాణ, పంట నష్టం చోటు చేసుకోకుండా చర్యలు – చైతన్య కుమార్‌ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి చిత్తూరు జిల్లాలో మొత్తం అడవులు 29శాతం మేర విస్తరించి 1.95 లక్షల హెక్టర్లలో ఉన్నాయి. ఈ అడువులు శేషాచలం అడువులకు అనుసంధానంగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశాం. అలాగే ఏనుగుల అడవి దాటి రాకుండా కందకాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏనుగుల సంచారం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. పెద్దపెద్ద శబ్దాలు చేయడం, టపాకాయలు కాల్చడం వంటివి చేయరాదు. 1.95 లక్షల హెక్టర్ల అటవీ ప్రాంతంలో 353 చదరపు కిలోమీటర్లు కౌండిన్య రాయల్‌ ఎలిఫెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేసి ఏనుగుల సంరక్షణ జిల్లాలో సుమారు మూడు నియోజకవర్గాల్లో ప్రధానంగా నిత్యం ఏనుగులు సంచరిస్తూ పంటపొలాల కోసం రావడం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలలో ప్రస్తుతం అనధికారిక లెక్కల ప్రకారం భారీ ఎత్తున ఏనుగులు ఉన్నట్లు అటవీ శాఖాధికారులు అంచన వేశాం. ఆహారం, నీటి కోసం పంటపొల్లోకి వస్తున్న ఏనుగుల నుండీ పంటను కాపాడుకోవడం కోసం రైతులు ఏనుగులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏనుగుల దాడిలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా కాంటూరు కందకాలు తవ్వడం, ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌ వేయడం జరుగు తున్నది. ఇప్పటివరకు 70 కిలోమీటర్లకు పైగా సోలార్‌ ఫెన్సింగ్‌ వేయగా మరో 60 కిలోమీటర్లు తవ్వడం జరిగింది. ప్రజలను భయాందోళన నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ట్రాకర్లను ఉపయోగించి పంట పొలాల వైపు వచ్చిన ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతాల్లోకి ట్రాప్‌ చేయడం నిరంతరంగా జరిగే ప్రక్రియ. పట్టుపురుగుల పంటపై ఏనుగులు దాడిచేసే అవకాశం చాల తక్కువగా ఉంటుంది. ఈమేరకు పట్టు పరిశ్రమ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పింస్తున్నాం. మల్బరీ పంటను సాగు చేయాలని ఏనుగులు దాడులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని రైతులను ప్రొత్సహించడం జరుగుతోంది.

➡️