మహిళలకు ప్రాధాన్యత ఏది?

Apr 10,2024 13:26 #Chittoor District

ప్రజాశక్తి-నగరి : కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఎక్కడ? అని ఆ పార్టీ గంగాధర నెల్లూరు అసెంబ్లీ సీటుకు ధరఖాస్తు చేసుకున్న టి. అములు ప్రశ్నించారు. బుధవారం ఆమె నగరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు మహిళలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేవారన్నారు. ప్రస్తుతం ఆ ప్రాధాన్యత ఏమైందన్నారు. షర్మిలమ్మ అనే మహిళ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలోనే మహిళలకు ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. జిల్లాలో ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరికి అవకాశం కల్పించిందన్నారు. మిగిలిన పార్టీలు ఏవీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరులోను, పూతలపట్టులోను కనీసం సీటుకోసం ధరఖాస్తు చేసుకోని వారికి సీట్లుకేటాయించారన్నారు. ఆర్ధిక బలమే వారికి దరఖాస్తుగా మారిందన్నారు. కార్వేటినగరం మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు టికెట్‌ విషయమై రూ. లక్ష డిమాండ్‌ చేశారన్నారు. దాన్ని తిరస్కరించడమే సీటురాకపోవడానికి కారణమైందన్నారు. రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న డాక్టర్‌ నరసింహులు రెండు పర్యాయాలు గంగాధర నెల్లూరు నుంచి తలపడ్డారని ఆయనకు కూడా సీటు కేటాయించలేదన్నారు. షర్మిళమ్మ పీసీసీ పదవిని దక్కించుకోవడంతో పార్టీ బలపడుతుందనుకున్నామని కానీ నేడు అది పాతాళ లోకం వైపు ప్రయాణిస్తోందన్నారు. నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బంధువర్గాలను కలుపుకొని త్వరలో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు.

➡️