ఎడెక్స్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి : ఎస్ఎఫ్ఐ

Feb 18,2024 16:27 #Kurnool, #SFI

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఉన్నత విద్య ఆన్‌లైన్‌ కోర్సుల ఎడెక్స్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల‌ని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాల ముసుగులో ప్రభుత్వ విద్యారంగంలో ప్రయివేటు సంస్థల జోక్యం, ఆన్లైన్ కోర్సుల విధానం తీసుకురావడం ప్రభుత్వ విద్యా రంగానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిగ్రీ చేరే విద్యార్థుల సంఖ్య లక్ష మందికి పడిపోయిందని, నాలుగేళ్ల డిగ్రీతో డ్రాపౌట్స్ పెంచుతుందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డిగ్రీ కళాశాలల ఎర్పాటు చేసి, అధ్యాపకులను నియమించి డిగ్రీ విద్యను వాటి ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి కానీ ఆన్లైన్ కోర్సుల పేరుతో ఎడెక్స్ సంస్థతో ఒప్పందం మరింత ఆందోళన కలిగిస్తుందని వాపోయారు. టెక్నాలజీ ఎప్పటికీ టీచర్ కి ప్రత్యామ్నాయం కాదని యునెస్కో విడుదల నివేదికలో వెల్లడించిందని అన్నారు. కోవిడ్ సమయంలోనే ఆన్లైన్ కోర్సులు వల్ల విద్యార్ధికి చదువు దూరం అయిందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ కోర్సులు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ విద్యను నీరుగార్చి, ప్రైవేటు సంస్థలు ప్రోత్సహించి భవిష్యత్తులో పూర్తిగా విద్యను ఆన్లైన్ విధానంలో తీసుకుని వచ్చేందుకేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వందల కోట్లు ముట్టచెప్పిన బైజూస్ ఒప్పందం వలన విద్యార్థులకు కొత్తగా ఒరిగిందేమీ లేదని అన్నారు. ఇదే మాదిరిగా ఎడెక్స్ కంపెనీకి కోట్ల రూపాయలు కట్టపెట్టేందుకే ఈ ఒప్పందం చేసారని ఇది అంతర్జాతీయ ప్రమాణాల అందిస్తున్నామనే ముసుగులో జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమేనని అన్నారు. వెంటనే విద్యార్థులకు నష్టం వాటిల్లేటువంటి ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆన్లైన్ కోర్సుల విధానం ఆలోచన విరమించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమ‌వుతామని హెచ్చరించారు.

➡️