ఓట్ల లెక్కింపు అత్యంత కీలకం

May 23,2024 20:57

 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు్‌

ఒకేసారి ఇవిఎంలు, పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కింపు

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరంకోట/టౌన్‌  : ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్‌ఒలు, ఎఆర్‌ఒలు, డిటిలు, నోడల్‌ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్‌ ఆడిటోరియంలో తొలివిడత అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. చిన్న పొరపాటుకు కూడా తావివ్వద్దని, ప్రతీఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ఈ ప్రక్రియపై అందరూ సమగ్ర అవగాహన కల్పించుకోవాలని సూచించారు. విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో, చీపురుపల్లి, రాజాం, ఎస్‌.కోట, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు లెండి ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అందువల్ల సిబ్బంది అంతా 6 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకొని, అంతా సిద్దం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవైపు ఇవిఎంలలో ఓట్ల లెక్కింపు, మరోవైపు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు అధిక సంఖ్యలో పోలైనందున, లెక్కింపు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విజయనగరం పార్లమెంటు స్థానం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మాత్రం లెండి కళాశాలలోనే నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం 20 టేబుళ్లతో పెద్ద హాలును సిద్దం చేస్తున్నామన్నారు. ఇవిఎంలలో ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో హాలులో 14 టేబుళ్లను సిద్దం చేస్తున్నామని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 8 గదులను, ఇవిఎం ఓట్ల లెక్కింపు కోసం 14 హాళ్లను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ గదిలో సిసి టివి ఉంటుందని, ఇవిఎంలు తీసుకువచ్చిన దగ్గరనుంచి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు వీడియో రికార్డింగ్‌ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును ధరించాలని, అవిలేకపోతే లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలివిడత లెక్కింపు, మలివిడత లెక్కింపు ప్రక్రియలను వివరించారు. కౌంటింగ్‌ హాలులో రిటర్నింగ్‌ అధికారులదే సర్వాధికారమని, వారే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయిస్తామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ట్రైనింగ్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ సుధాకరరావు, ఆర్‌ఒలు పాల్గొన్నారు.

➡️