పోరాటాల వారధి సిపిఎం

Apr 25,2024 21:31

ప్రజాశక్తి – గరుగుబిల్లి : దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, మైనార్టీలు తదితరుల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం పోరాడే వారధి సిపిఎం అని, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కురుపాం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మండంగి రమణ కోరారు. మండలంలోని ఉల్లిభద్ర, సుంకి, ఖడ్గవలస, నాగూరు, లకనాపురం, రావివలస, దత్తివలస తదితర గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి తన గెలుపునకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో బిజెపి మతోన్మాద ప్రమాదం రోజురోజుకు పెరుగుతుందని, రాజ్యాంగాన్ని మార్చి నియంతృత్వాన్ని దేశంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బిజెపికి తొత్తులుగా రాష్ట్రంలోని తెలుగుదేశం, వైసిపి, జనసేన వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. దేశ భవిష్యత్తు కోసం, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు, ఉపాధి హామీ చట్టం పరిరక్షించుకునేందుకు ఇండియాబ్లాక్‌ లో భాగంగా సిపిఎం అభ్యర్థులుగా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి ముండంగి రమణ, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి పి.అప్పలనరస పోటీ చేస్తున్నారని, వీరిద్దరికీ సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఎం నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బోను శంకర్రావు తదితరులు మాట్లాడారు.గుమ్మలక్ష్మీపురం : ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పులిగూడలో ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నేటి పాలకుల స్వార్థపూరిత విధానాలతో గిరిజనుల హక్కులు చట్టాలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు. టిడిపి, వైసిపి హయాంలో గిరిజనాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోలక అవినాష్‌, బిడ్డిక ఆడిత్‌ తదితరులు ఉన్నారు.కొమరాడ : రాష్ట్రానికి ద్రోహం చేసే బిజెపి, దాని మిత్రపక్షాలతో పాటు అధికార వైసిపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వి.ఇందిర పిలుపునిచ్చారు. మండలంలోని గిరిజన మారుమూరు ప్రాంతాల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో మండలంలోని చోళ్లపదం, రెబ్బలో ఇంటింటి ప్రచారం చేశారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్నివేళలా నికరంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులుగా కురుపాం అసెంబ్లీకి స్థానానికి మండంగి రమణ, అరకు పార్లమెంటరీ స్థానానికి పాచిపెంట అప్పలనరస పోటీ చేస్తున్నారని తెలిపారు. వీరి గుర్తు సుత్తి, కొడవలి, నక్షత్రం కావున ఈ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పలువురు గిరిజన యువకులు పాల్గొన్నారు.

➡️